LOADING...
Donald Trump: బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ గ్రీన్ సిగ్నల్
బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ గ్రీన్ సిగ్నల్

Donald Trump: బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 05, 2025
08:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం ముగింపునకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) తీసుకొచ్చిన ప్రణాళికను ఇరుపక్షాలు సూత్రప్రాయంగా అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లే దిశగా ట్రంప్‌ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. గాజా నుంచి ఇజ్రాయెల్‌ (Israel) బలగాలను ఉపసంహరించేందుకు అంగీకరించిందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ట్రూత్‌ సోషల్‌ (Truth Social)లో చేసిన పోస్టులో ప్రణాళిక తొలి దశలో భాగంగా గాజా (Gaza) నుంచి బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్‌ సిద్ధమైనట్లు తెలిపారు. ఈ సమాచారాన్ని హమాస్‌ (Hamas)కు కూడా పంపించినట్లు చెప్పారు.

Details

ఖైదీల మార్పిడి ప్రక్రియ ప్రారంభం

హమాస్‌ దీన్ని అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణ (Ceasefire) అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇరుపక్షాల మధ్య బందీలు, ఖైదీల మార్పిడి ప్రక్రియ ప్రారంభమవుతుందని వివరించారు. బందీల అప్పగింత అనంతరం బలగాల ఉపసంహరణకు సంబంధించిన షరతులను ఖరారు చేస్తామని తెలిపారు. అయితే ఈ విషయంపై ఇజ్రాయెల్‌ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక అమెరికా ప్రతిపాదించిన ప్రణాళికపై ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య రాబోయే సోమవారం ఈజిప్టులో పరోక్ష చర్చలు జరగనున్నాయి. ట్రంప్‌ ప్రణాళికపై హమాస్‌ ఇప్పటికే సానుకూల సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Details

ఇంకా కొన్ని అంశాలపై చర్చలు జరపాలి

బందీల విడుదలకు, గాజా పాలనను తాత్కాలిక ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధమని ప్రకటించింది. అయితే, ఇంకా కొన్ని అంశాలపై చర్చలు జరపాలని హమాస్‌ స్పష్టం చేసింది. దీనిని ట్రంప్‌ స్వాగతిస్తూ, గాజాపై బాంబు దాడులు జరపవద్దని ఇజ్రాయెల్‌కు సూచించారు. అయినప్పటికీ, అధ్యక్షుడి సూచనలను పట్టించుకోకుండా ఇజ్రాయెల్‌ దాడులకు దిగింది. ఈ దాడుల్లో సుమారు 57 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు.