హమాస్ చీఫ్ తండ్రి ఇంటిపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. కుటుంబం అంతా మృతి
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం 5వ రోజుకు చేరుకుంది. మొదటి మూడు రోజులు యుద్ధంలో హమాస్ గ్రూప్ పై చేయి సాధించింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ సైన్యం తన ఆధిపత్యాన్ని చెలాయించడం మొదలుపెట్టింది. రెండు రోజులుగా హమాస్ ఉగ్రవాదులను వెతికి వెతికి చంపుతోంది. అంతేకాకుండా గాజాపై రాకెట్లతో విరుచుకుపడుతోంది. తాజాగా గాజా స్ట్రిప్‌లోని అల్ ఫుర్కాన్ పరిసరాల్లో 200 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని వైమానికి దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించాయి. ఈ తాజా లక్ష్యాల్లో హమాస్ చీఫ్ మహ్మద్ దీఫ్ తండ్రి ఇల్లు ధ్వంసమైంది. ఈ దాడిలో దీఫ్ తండ్రి, అతని సోదరుడు, పిల్లలతో సహా కుటుంబం అంతా మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
వీల్ చైర్‌లో ఉండి హమాస్‌కు నాయకత్వం
ఇజ్రాయెల్‌లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో మహ్మద్ దీఫ్ ఉన్నాడు. అతని గురించి తెలిసిన వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రస్తుతం వీల్ చైర్‌లో ఉన్న దీఫ్.. 2002 నుంచి హమాస్ సైనిక విభాగానికి నాయకుడిగా ఉన్నాడు. దీఫ్‌ను అంతమొందించడానికి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్సీ 'మొస్సాద్' అనేక ప్రయత్నాలు చేసింది. కానీ అతను చాలా సార్లు తృటిలో తప్పించుకున్నాడు. 1965లో గాజా ఈజిప్టు ఆధీనంలో ఉన్నప్పుడు మహ్మద్ దీఫ్ శరణార్థి శిబిరంలో జన్మించాడనే వివరాలు తప్ప అతని గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. 1980ల చివరలో దీఫ్ హమాస్‌లో చేరాడు. అనతి కాలంలో హమాస్‌లో ఎదిగాడు. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో అతని భార్య, 7 నెలల కుమారుడు, 3 సంవత్సరాల కుమార్తె 2014లో మరణించారు.