వైద్యరంగంలో అద్భుతం.. తెగిపోయిన తలను తిరిగి అతికించిన ఇజ్రాయిల్ డాక్టర్లు
ఇజ్రాయెల్ వైద్యులు ప్రపంచమే ఆశ్చర్యపోయే రీతిలో అసాధారణ వైద్య చికిత్సలు అందించారు. దాదాపుగా తెగిపోయిన తలను తిరిగి అతికించి ఓ బాలుడికి పునర్జన్మను అందించారు. ఇజ్రాయెల్‌కు చెందిన 12 ఏళ్ల బాలుడు సులేమాన్ హసన్ సైకిల్‌పై వెళ్తుండగా గుర్తు తెలియని కారు వెనక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో హసన్ తీవ్ర గాయాల బారిన పడ్డాడు. ఘటనలో అతడి తల భాగం మెడ నుంచి దాదాపు వేరయిపోయింది. హుటాహుటిన క్షతగాత్రుడ్ని విమానంలో హదస్సా మెడికల్ సెంటర్‌కు తరలించారు. ఈ మేరకు కేసు టేక్ అప్ చేసిన వైద్యులు కొన్ని గంటల పాటు నిర్విరామంగా శ్రమించారు.
ఎటువంటి సాయం లేకుండా నడవగలగడం అద్భతం : డాక్టర్ ఐనావ్
క్లిష్టమైన పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య విధానాలను ఉపయోగించిన ఇజ్రాయిల్ డాక్టర్ల బృందం తెగిపోయిన అతడి తలను తిరిగి అతికించి వైద్యశాస్త్రానికే పాఠాలు నేర్పారు. ఈ సందర్భంగా వైద్య రంగంలో ప్రపంచంలోనే ఇదో అద్భుతమని సదరు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన గత నెల జూన్ లో జరిగిందని, కానీ దానికి సంబంధించిన వివరాలు తాజాగా వైద్యులు ప్రకటించారు. ఈ క్రమంలోనే హసన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్చ్ అయ్యాడని అక్కడి వైద్యులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అతడ్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని స్పష్టం చేశారు. కష్టతరమైన ఆపరేషన్ తర్వాత హసన్ సాధారణంగా పని చేస్తున్నాడని, ఎటువంటి సాయం లేకుండా నడవగలగడం మామూలు విషయం కాదని డాక్టర్ ఐనావ్ హర్షం వ్యక్తం చేశారు.