పాలస్తీనాపై ఇజ్రాయెల్ దళాల దాడి; 11మంది మృతి
పాలస్తీనాలోని ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని ఫ్లాష్‌పాయింట్ నగరంపై ఇజ్రాయెల్ దళాలు బుధవారం జరిపిన దాడిలో కనీసం నలుగురు ముష్కరులు, నలుగురు పౌరులతో సహా 11మంది పాలస్తీనియన్ల చనిపోయారు. 100మందికిపైగా గాయపడినట్లు అధికారులు చెప్పారు. నాబ్లస్‌లో జరిగిన ఆపరేషన్‌ను ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది. ఉగ్రవాదులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కాల్పులు జరిగినట్లు సైనికాధికారులు చెప్పారు. ఇజ్రాయెల్ సైనికులకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆర్మీ తెలిపింది.
2023లో ఇప్పటివరకు తీవ్రవాదులు, పౌరులతో సహా 62మంది మృతి
పాలస్తీనా మిలిటెంట్ ఫ్యాక్షన్ ఇస్లామిక్ జిహాద్‌కు చెందిన కమాండర్లను ఇజ్రాయెల్ దళాలు నాబ్లస్‌లోని ఒక ఇంటిలో చుట్టుముట్టయి. ఈ క్రమంలో వారి మద్దతుదారులు అక్కడికి చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరిపినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ చెబుతోంది. ఇద్దరు ఇస్లామిక్ జిహాద్ కమాండర్లతో పాటు మరో తీవ్రవాది హతమైనట్లు పాలస్తీనా వర్గాలు తెలిపాయి. మృతుల్లో నలుగురు పౌరులు కూడా ఉన్నారని పేర్కొన్నాయి. 2023లో ఇప్పటివరకు తీవ్రవాదులు, పౌరులతో సహా 62 మంది పాలస్తీనియన్లు మరణించారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.