పాక్‌ను 'ఉగ్రవాద కేంద్రం' అంటే.. చాలా చిన్న పదం అవుతుంది: జైశంకర్
దాయాది దేశం పాకిస్థాన్ కుట్రలను అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ఎత్తిచూపారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందన్నారు. పాక్‌ను 'ఉగ్రవాద కేంద్రం' అంటే చాలా చిన్నపదం అవుతుందని, అంతకు మించిన కఠిన పదాన్ని వాడాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం ఆస్ట్రియాలో పర్యటిస్తున్న జైశంకర్.. వియన్నాలో జరిగిన కార్యక్రమంలో పాకిస్థాన్‌పై మాటల తూటాలు పేల్చారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ పెంచి పోషిస్తోందన్నారు. పాక్ మాదక ద్రవ్యాలు, అక్రమ ఆయుధాల వ్యాపారం, అంతర్జాతీయ నేరాల గురించి ఎంత చెప్పినా.. తక్కువే అన్నారు. ఆ తీవ్రవాద కేంద్రానికి(పాక్) భారత దగ్గరగా ఉన్నందున తమకు ఎన్నో అనుభవాలు ఉన్నాయన్నారు.
'భారత పార్లమెంటుపై పాకిస్థాన్ దాడి'
కొన్నేళ్ల క్రితం భారత పార్లమెంటుపై పాకిస్థాన్ దాడి చేసిందన్నారు మంత్రి ఎస్ జైశంకర్. అలాగే ముంబయి నగరంలోకి ఉగ్రవాదులను పంపి విధ్వంసం సృష్టించిందని గుర్తు చేశారు. విదేశీ పర్యాటకులపై దాడి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం సరిహద్దుల గుండా ఉగ్రవాదులను భారత్‌లోకి పాకిస్థాన్ పంపుతోందని దుయ్యబట్టారు. డిసెంబర్‌లో భారత్ అధ్యక్షతన జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం నుంచి ఎక్కడ అవకాశం వచ్చినా.. జైశంకర్ పాక్‌పై విరుచుకుపడుతున్నారు. ఆస్ట్రియా పర్యటనలో భాగంగా ఆ దేశ విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ షాలెన్‌బర్గ్‌తో ఉగ్రవాదం వల్ల అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పులు, హింసాత్మక తీవ్రవాదం, రాడికలైజేషన్, ఛాందసవాదం వంటి వాటిపై సుదీర్ఘంగా చర్చించారు.