LOADING...
Benjamin Netanyahu: భారత్‌కు రానున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
భారత్‌కు రానున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

Benjamin Netanyahu: భారత్‌కు రానున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 21, 2025
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-ఇజ్రాయెల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరో కీలక దశలోకి చేరబోతున్నాయి. ఈ ఏడాది చివరిలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్ పర్యటనకు రాబోతున్నారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ పర్యటన ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా, భారత్, రష్యా వంటి దేశాలపై టారిఫ్‌ల ద్వారా ఒత్తిడి పెంచారు. అదే సమయంలో హమాస్‌తో యుద్ధం కొనసాగితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాయని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఈ ఒత్తిడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ తాత్కాలికంగా కాల్పుల విరమణకు అంగీకరించింది. అయితే, హమాస్ పూర్తిగా లొంగిపోకపోతే గాజాలో యుద్ధం ఆగదని నెతన్యాహు స్పష్టత ఇచ్చారు.

Details 

భారత్‌తో సంబంధాలు బలోపేతం చేసేందుకు చర్యలు

అమెరికా ఒత్తిడిని పక్కన పెట్టి, భారత్‌తో వ్యూహాత్మక, సత్సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు నెతన్యాహు ఈ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటనలో శాస్త్ర సాంకేతిక రంగం, అంతరిక్ష పరిశోధన, రక్షణ, వ్యవసాయం, నీటి నిర్వహణ, వాణిజ్యం వంటి కీలక రంగాల్లో కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే భారత్-ఇజ్రాయెల్ మధ్య రక్షణ రంగంలో పలు సహకార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భారత్ ఒకవైపు గాజా ప్రజలకు మానవతా సహాయం అందిస్తూ, మరోవైపు ఇజ్రాయెల్‌తో వ్యూహాత్మక ఒప్పందాలను కుదుర్చుకుంటూ సమతుల్యమైన దౌత్య విధానాన్ని కొనసాగిస్తోంది.