Syria: సిరియాలో ఇజ్రాయెల్ సైనికుల ప్రవేశం.. ఆబ్డీన్‌లో ఉద్రిక్త పరిస్థితులు
ఈ వార్తాకథనం ఏంటి
సిరియాలోని ఆబ్డీన్ పట్టణంలో ఇజ్రాయెల్ సైనికులు మరోసారి ప్రవేశించడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. సైనికుల రాకను స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వారికి అడ్డుకట్ట వేయడానికి రాళ్లు విసిరారు. అలాగే రహదారులపై రాళ్లను పేర్చి వారి కదలికలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఇజ్రాయెల్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న దక్షిణ సిరియాలో సుమారు 235 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో బఫర్ జోన్ ఉంది. ఈ ప్రాంతంలో గతంలో ఐక్యరాజ్య సమితి శాంతి దళాలు గస్తీ నిర్వహించేవి. అయితే 2024 డిసెంబరులో ఆ బఫర్ జోన్ మొత్తాన్ని ఇజ్రాయెల్ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అప్పటి నుంచి సమీపంలోని ఆబ్డీన్ పట్టణంలోకి అప్పుడప్పుడు ప్రవేశించి గస్తీ నిర్వహిస్తున్నాయి.
వివరాలు
స్థానిక ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన
పొరుగు దేశ సైనికులు తమ భూభాగంలోకి రావడాన్ని సిరియా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఇజ్రాయెల్ బలగాలు తమ చర్యలను కొనసాగిస్తున్నాయి. తాజాగా కేవలం 24 గంటల వ్యవధిలోనే రెండుసార్లు ఆబ్డీన్‌లోకి ప్రవేశించి గస్తీ నిర్వహించేందుకు ప్రయత్నించగా, స్థానిక ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ సైనికులు తొలుత గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం నిరసనకారులను చెదరగొట్టేందుకు ఫిరంగి గుళ్లను కూడా ప్రయోగించారు. అయినప్పటికీ ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదు.
వివరాలు
ఆబ్డీన్ ప్రాంత ప్రజల్లో తీవ్ర ఆందోళన
అయితే ఇజ్రాయెల్ బలగాలు తమ ప్రాంతాన్ని శాశ్వతంగా ఆక్రమిస్తాయనే భయంతో ఆబ్డీన్ ప్రాంత ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటికే పలువురు తమ ఇళ్లను విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు సమాచారం. తిరుగుబాటుదారుల దాడులను అడ్డుకునేందుకు మాత్రమే బఫర్ జోన్‌ను తాత్కాలికంగా తమ నియంత్రణలోకి తీసుకున్నామని తొలుత ప్రకటించిన ఇజ్రాయెల్, ప్రస్తుతం ఆ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లే ఉద్దేశం లేదని స్పష్టం చేస్తుండటం ఈ వివాదాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది.