Japan Floods: వరదలతో జపాన్ అల్లకల్లోలం.. వాతావరణ శాఖ ఎమర్జెన్సీ హెచ్చరిక
జపాన్ మరోసారి వరద ముప్పునకు గురైంది. ఈ ఏడాది ఆరంభంలో సంభవించిన భారీ భూకంపం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జపాన్‌లో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా వరదల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇషికావా ప్రాంతంలో కనీసం 12 నదులు నీటిమట్టాన్ని దాటి, ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఈ పరిస్థితుల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
రానున్న 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ఎమర్జెన్సీ హెచ్చరికలు జారీ చేసింది. అధికారుల ఆదేశాలతో వాజిమా నగరంలో 18,000 మంది, సుజు నగరంలో 12,000 మంది, నిగాటాలో 16,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో, జనవరి 1న జపాన్‌లో 7.5 తీవ్రతతో జరిగిన భూకంపం 200 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ భూకంపం నోటో ద్వీపకల్పంలోని వాజిమా, సుజు నగరాలను తీవ్రంగా ప్రభావితం చేసింది.