Jill Biden: మోదీ బహూకరించిన వజ్రంపై మనసుపడ్డ జిల్ బైడెన్..!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పదవీకాలంలో ప్రధాని నరేంద్ర మోదీ బహూకరించిన 7.5 క్యారెట్ల సింథటిక్ వజ్రాన్ని అమెరికా మాజీ ప్రథమ మహిళ జిల్ బైడెన్ తాజాగా గుర్తు చేసుకున్నారు. మోదీ అందించిన ఆ విలువైన బహుమతిని మొదట తన వద్దే ఉంచుకోవాలని భావించినప్పటికీ, అమెరికా నిబంధనల కారణంగా చివరకు ఫెడరల్ ప్రభుత్వానికి తిరిగి అప్పగించాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు. 'వ్యూ ఫ్రమ్ ది ఈస్ట్ వింగ్: ఎ మెమోయిర్' పేరుతో విడుదల చేసిన తన ఆత్మకథలో జిల్ బైడెన్ ఈ విషయాలను ప్రస్తావించారు. వైట్ హౌస్‌లోని తెరవెనుక జీవితంతో పాటు, అధ్యక్షుడి కుటుంబ సభ్యులు విదేశీ నాయకుల నుంచి అందుకునే బహుమతులకు సంబంధించిన నిబంధనలను కూడా ఆమె వివరించారు.
వివరాలు
7.5 క్యారెట్ల సింథటిక్ వజ్రం
2023 జూన్‌లో వైట్ హౌస్‌లో నిర్వహించిన అధికారిక విందుకు ప్రధాని నరేంద్ర మోదీ అతిథిగా హాజరైన సందర్భంగా ఈ 7.5 క్యారెట్ల సింథటిక్ వజ్రాన్ని జిల్ బైడెన్‌కు బహూకరించారు. ఆ వజ్రం తనను ఎంతో ఆకట్టుకుందని, అది అత్యంత అద్భుతంగా అనిపించిందని ఆమె ఆత్మకథలో పేర్కొన్నారు. అయితే జో బైడెన్ పదవి నుంచి వైదొలిగిన అనంతరం అమెరికా నిబంధనల ప్రకారం ఆ బహుమతిని ప్రభుత్వానికి తిరిగి అప్పగించాల్సి వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత దానికి ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువ చెల్లించి కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు వివరించారని చెప్పారు. దీంతో ఆ వజ్రాన్ని కొనుగోలు చేయాలని తాను మొదట అనుకున్నట్లు వెల్లడించారు.
వివరాలు
అమెరికా ప్రభుత్వం నుంచి అధికారికంగా కొనుగోలు
కానీ అమెరికా విదేశాంగ శాఖ ఆ వజ్రం విలువను 20వేల డాలర్లుగా అంచనా వేయడంతో దానిని కొనుగోలు చేయాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు తెలిపారు. అయితే ఆ వజ్రాన్ని అధికారిక కార్యక్రమాల కోసం అరువుగా తీసుకుని ధరించేందుకు అధికారులు అనుమతి ఇచ్చారని పేర్కొన్నారు. అనంతరం ఆ డైమండ్‌ను ఒక ఉంగరంలో పొదిగించి పలుమార్లు ధరించినట్లు వెల్లడించారు. ఫ్రాన్స్ ప్రథమ మహిళ బ్రిగిట్టే మెక్రాన్ తనకు బహూకరించిన బ్రాస్‌లెట్‌ను మాత్రం అమెరికా ప్రభుత్వం నుంచి అధికారికంగా కొనుగోలు చేసినట్లు జిల్ బైడెన్ తెలిపారు. కాగా 2023 సంవత్సరంలో ప్రపంచ దేశాధినేతల నుంచి జిల్ బైడెన్‌కు అందిన బహుమతుల్లో అత్యంత ఖరీదైనది ప్రధాని నరేంద్ర మోదీ బహూకరించిన ఈ వజ్రమేనని అప్పట్లో అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.