Taliban: 'ఖైబర్ ఫఖ్తుంఖ్వా మా భూభాగమే'.. తాలిబన్ రక్షణ శాఖ సంచలన ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్నాయి.
పాకిస్తాన్ తన భూభాగాల్లో తాలిబాన్ స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేయడంతో తాలిబన్లు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తాజా పరిణామాల్లో తాలిబన్లు పాకిస్థాన్ సరిహద్దుల్లోని ఆర్మీ ఔట్‌పోస్టులపై దాడులు ప్రారంభించారు.
కుర్రం, ఉత్తర వజీరిస్తాన్‌లోని గిరిజన జిల్లాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరుగుతున్నాయి. ప్రాణ నష్టంపై ఖచ్చితమైన సమాచారం లేదు.
ఇరువైపులా భారీ ఆయుధాలను మోహరించినట్లు సమాచారం. ఈ వారం ప్రారంభంలో, తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ రహస్య స్థావరాలను పాకిస్తాన్ వైమానిక దాడులతో లక్ష్యంగా చేసుకుంది.
ఈ దాడుల్లో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబన్లు హెచ్చరించారు. దాదాపు 15,000 మంది తాలిబాన్ ఫైటర్లు పాకిస్తాన్ సరిహద్దుల్లో చేరుకున్నట్లు సమాచారం.
Details
తాలిబన్
ఇక తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ సంచలన ప్రకటన చేసింది.
ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ పాకిస్తాన్ భూభాగం కాదని, అది తమదేనని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇనాయతుల్లా ఖ్వారిజ్మీ స్పష్టం చేశారు.
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య ఉన్న 'డ్యూరాండ్ లైన్'ను ఆఫ్ఘనిస్తాన్ ఎప్పటి నుంచో గుర్తించలేదు. ఈ క్రమంలో ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంపై కూడా తమ హక్కు ఉందని తాలిబాన్ వాదిస్తోంది.
శుక్రవారం జరిగిన ఘటనల్లో ఖోస్ట్, పక్తికా ప్రావిన్సుల నుంచి తాలిబన్లు ఖైబర్ ఫఖ్తుంఖ్వాలోని ఉత్తర వజీరిస్తాన్, కుర్రం ప్రాంతాలపై దాడులకు పాల్పడ్డారు.
ఈ పరిణామాలు ఇరు దేశాల మధ్య పరిస్థితిని మరింత సంక్షోభానికి దారితీసేలా చూపిస్తున్నాయి.