కింగ్ చార్లెస్- III పట్టాభిషేకం వేళ బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో తూటాల కలకలం
బ్రిటన్ కింగ్ చార్లెస్- III పట్టాభిషేకం వేళ లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో తూటాల కలకలం రేగింది. షాట్‌గన్ కాట్రిడ్జ్‌లను ప్యాలెస్ మైదానంలోకి విసిరిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కింగ్ చార్లెస్ III -క్వీన్ కెమిల్లా పట్టాభిషేక వేడుకకు నాలుగు రోజుల ముందు ఈ సంఘటన జరగడం గమనార్హం. అయితే ఈ ఘటనలో ఉగ్ర కోణం లేదని లండన్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో అధికారులకు గానీ, ప్రజలకు గానీ ఎవరికి ఎటువంటి గాయాలు జరగలేదని వెల్లడించారు.
మే 6న వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో చార్లెస్ పట్టాభిషేకం
ప్రమాదకర ఆయుధాన్ని కలిగి ఉన్నాడనే అనుమానంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అతని వద్ద కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద అనుమానాస్పద బ్యాగ్ కూడా ఉన్నట్లు మెట్రోపాలిటన్ పోలీసులు చెప్పారు. తూటాల కలకలం నేపథ్యంలో పోలీసులు పటిష్ణ బందోబస్తు ఏర్పాటు చేశారు. తూటాలు ప్యాలెస్‌లోకి విసిరిన సమయంలో రాజు, రాణి బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో లేరని బీబీసీ నివేదించింది. మే 6న లండన్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో బ్రిటన్ కింగ్ చార్లెస్- III పట్టాభిషేకం జరగనుంది.