LOADING...
Sheikh Hasina: షేక్‌ హసీనా అప్పగింతకు న్యాయ ప్రక్రియే ఆధారం : తారిఖ్ రెహమాన్
షేక్‌ హసీనా అప్పగింతకు న్యాయ ప్రక్రియే ఆధారం : తారిఖ్ రెహమాన్

Sheikh Hasina: షేక్‌ హసీనా అప్పగింతకు న్యాయ ప్రక్రియే ఆధారం : తారిఖ్ రెహమాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 15, 2026
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తారిఖ్ రెహమాన్ శనివారం దేశ ప్రజలను ఉద్దేశించి తొలి ప్రసంగం చేశారు. తన ప్రభుత్వ తొలి ప్రాధాన్యం దేశ ప్రయోజనాలకేనని ఆయన స్పష్టం చేశారు. భారత్‌లో ఆశ్రయం పొందిన మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింత పూర్తిగా న్యాయ ప్రక్రియపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. హసీనాను భారత్‌ అప్పగించాలని బీఎన్‌పీ సీనియర్‌ నేతలు కొందరు డిమాండ్‌ చేస్తున్న తరుణంలో తారిఖ్‌ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 'బంగ్లాదేశ్‌ ప్రజల ప్రయోజనాలే దేశ విదేశాంగ విధానాన్ని నిర్దేశిస్తాయి' అని తారిఖ్‌ రెహమాన్‌ స్పష్టం చేశారు. దేశంలో శాంతి భద్రతలకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు.

Details

కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు

సమాజంలోని ప్రతి వర్గం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని దేశ పునర్నిర్మాణం చేపడతామని భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు వేగవంతమయ్యాయి. బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ మరో నాలుగు రోజుల్లో తారిఖ్‌ రెహమాన్‌ ఏర్పాటు చేయనున్న మంత్రివర్గానికి పదవీ స్వీకార ప్రమాణం చేయించే అవకాశం ఉందని అభిజ్ఞ వర్గాలు పేర్కొన్నాయి.

Details

భారత్‌తో నిర్మాణాత్మక అనుబంధం కొనసాగింపు

భారత్‌తో సానుకూల, నిర్మాణాత్మక సంబంధాలను కొనసాగిస్తామని తారిఖ్‌ రెహమాన్‌ స్పష్టం చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన విజయంపై సోషల్‌ మీడియా వేదికగా తెలియజేసిన అభినందనలకు ఆయన స్పందించారు. బంగ్లాదేశ్‌ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉంటుందని, సమగ్ర పురోగతి మరియు ప్రగతిశీల అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని తారిఖ్‌ రెహమాన్‌ వెల్లడించారు.

Advertisement