Loading...
France: ఫ్రాన్స్‌లో సూపర్ మార్కెట్లపై సైబర్ దాడి.. పాడైన ఆహార పదార్థాలు, చెలరేగిన మంటలు
పాడైన ఆహార పదార్థాలు, చెలరేగిన మంటలు

France: ఫ్రాన్స్‌లో సూపర్ మార్కెట్లపై సైబర్ దాడి.. పాడైన ఆహార పదార్థాలు, చెలరేగిన మంటలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 13, 2026
01:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్రాన్స్‌లోని పలు ప్రముఖ సూపర్ మార్కెట్లపై సైబర్ దాడి కలకలం రేపింది. హ్యాకర్లు రిఫ్రిజిరేషన్ వ్యవస్థలను తమ ఆధీనంలోకి తీసుకుని ఫ్రిజ్‌లు, ఫ్రీజర్ల ఉష్ణోగ్రతలను పెంచడంతో ఆహార పదార్థాలు పాడయ్యాయి. కొన్ని చోట్ల మంటలు కూడా చెలరేగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో రిటైల్ రంగానికి కోట్లాది యూరోల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ఘటనకు కారణాలను గుర్తించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా పలు సూపర్ మార్కెట్లలోని అనుసంధానిత శీతలీకరణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇంటర్‌మార్షే దుకాణంలో కరిగిపోయిన ఫ్రోజెన్ ఫుడ్‌ను సిబ్బంది పెద్ద చెత్త కంటైనర్‌లో పడేయడాన్ని స్థానిక నివాసి గీర్ట్ డి క్లెర్క్ చూశారు.

వివరాలు 

ప్రముఖ సూపర్ మార్కెట్లకు భారీ నష్టం 

కరిగిన ఐస్‌క్రీమ్ రోడ్డుపైకి కారడం పరిస్థితి తీవ్రతను తెలియజేసింది.

క్యారీఫోర్‌కు చెందిన 80 సూపర్ మార్కెట్లు ప్రభావితమయ్యాయి.

సుమారు 490 దుకాణాలను నిర్వహించే మోనోప్రిక్స్‌లో ఐదు శాతం స్టోర్లపై ప్రభావం పడింది.

ఇంటర్‌మార్షే యజమాని లెస్ మౌస్కెటైర్స్ ప్రకారం, దాదాపు 150 దుకాణాల్లో ఫ్రిజ్‌లు,ఫ్రీజర్లు ఆరు గంటలపాటు 50 డిగ్రీల సెల్సియస్ వరకు వేడెక్కాయి.

ఆహార భద్రత దృష్ట్యా ప్రభావిత పదార్థాలను తొలగించారు. యూ సూపర్ మార్కెట్ గ్రూప్ కూడా దాడిని ధ్రువీకరించింది.

ఈ.లెక్లెర్క్, ఓషాన్ సంస్థల నుంచి వెంటనే స్పందన రాలేదు. ఇంటర్‌మార్షే సీఈఓ థియరీ కొటియార్డ్ అంచనా ప్రకారం, నష్టం ఒక్క రోజులోనే పదుల మిలియన్ల యూరోలకు చేరవచ్చు.

వివరాలు 

పాత సాఫ్ట్‌వేర్‌లో భద్రతా లోపాలు

సరఫరా వ్యవస్థలో సైబర్ భద్రత ప్రాముఖ్యతను ఈ ఘటన మరోసారి చాటిందని యూరోకామర్స్ డైరెక్టర్ జనరల్ క్రిస్టెల్ డెల్‌బెర్గ్ పేర్కొన్నారు.

సూపర్ మార్కెట్లలో అనేక ఫ్రిజ్‌లను ఒకే కంట్రోల్ వ్యవస్థ ద్వారా నిర్వహిస్తారు.

ఇంటర్నెట్ ద్వారా ఉష్ణోగ్రతలను మార్చుకునే సౌకర్యమే దాడికి మార్గమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

డానిష్ సంస్థ డాన్‌ఫాస్ సాఫ్ట్‌వేర్‌లో భద్రతా లోపాన్ని ఫ్రాన్స్ జాతీయ సైబర్ భద్రతా సంస్థ గుర్తించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

పాత ఫర్మ్‌వేర్‌తో పనిచేస్తున్న పరికరాలు ప్రభావితమైనట్లు డాన్‌ఫాస్ పేర్కొంది.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు,ఆధునిక వ్యవస్థల వినియోగాన్ని సూచించింది.

గతంలో ఏకే-ఎస్ఎం 800ఏ కంట్రోలర్‌లోని లోపాలపై క్లారోటీ సంస్థ పరిశోధన నివేదిక విడుదల చేసింది.

అయితే, ప్రస్తుత దాడికి ఆ లోపాలే కారణమా అనేది స్పష్టంగా తెలియలేదు.

ADVERTISEMENT

వివరాలు 

అమెరికా, నెదర్లాండ్స్‌లోనూ సైబర్ అంతరాయాలు.. ఫ్రాన్స్‌ ఘటనతో సంబంధం ఉందా?

ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ లెకోర్నూ దర్యాప్తునకు ఆదేశించగా, ఇతర యూరోపియన్ దేశాల అధికారులతోనూ సమన్వయం చేస్తున్నారు.

ఆగస్టు చివర్లో అమెరికాలోని సుమారు డజను సైనిక కమిసరీల్లోనూ ఫ్రిజ్‌లకు అంతరాయాలు ఏర్పడి ఆహారం పాడైంది.

ఆ ఘటనలకు ఫ్రాన్స్ దాడితో సంబంధం ఉందో లేదో తెలియదు. ఇదే సమయంలో నెదర్లాండ్స్ రిటైలర్ ఆహోల్డ్ డెల్‌హైజ్ తన నెట్‌వర్క్‌లో భద్రతా సమస్య కారణంగా కొన్ని వ్యవస్థలను నిలిపివేసింది.

ఆల్బర్ట్ హైజన్ ఆన్‌లైన్ కిరాణా డెలివరీలకు అంతరాయం ఏర్పడగా, భౌతిక దుకాణాలు తెరిచే ఉన్నాయి.

అమెరికాలోని స్టాప్ అండ్ షాప్, జెయింట్, హన్నాఫోర్డ్, ఫుడ్ లయన్ వెబ్‌సైట్లలోనూ తాత్కాలిక అంతరాయాల సందేశాలు కనిపించాయి.

అయితే, వీటికి ఫ్రాన్స్ ఘటనతో సంబంధం లేదని ఆహోల్డ్ డెల్‌హైజ్ స్పష్టం చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

ఆహార భద్రతకు సైబర్ ముప్పు..  

ఈ పరిణామాలు ఆహార సరఫరా వ్యవస్థకు సైబర్ దాడులు ఎంతటి ముప్పుగా మారవచ్చో వెల్లడిస్తున్నాయి.

పాత సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడం, ఇంటర్నెట్ ప్రాప్యతను పరిమితం చేయడం, అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించే వ్యవస్థలను ఏర్పాటు చేయడం అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

దాడుల వెనుక ఎవరున్నారు, ఇతర దేశాలకూ ముప్పు ఉందా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

ADVERTISEMENT