Russia-Ukraine: ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా.. త్రైపాక్షిక చర్చలకు ఓకే అంటూనే దాడులు
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా సాగుతున్న ప్రయత్నాలకు మరోసారి ఆటంకం ఎదురైంది. యుద్ధ విరమణపై మూడు దేశాల మధ్య చర్చలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై క్షిపణి దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం రాత్రి పలు దశల్లో జరిగిన ఈ దాడులతో కీవ్‌లోని భవనాలు, విద్యుత్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఈ దాడుల్లో ఇద్దరు మరణించగా, చిన్నారులు సహా పలువురు గాయపడినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. మరోవైపు, ఉక్రెయిన్ ప్రయోగించిన దాదాపు 808 డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని రష్యా గురువారం ప్రకటించింది.
వివరాలు
ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లోనూ శాంతి ప్రయత్నాలు
రష్యా, ఉక్రెయిన్ మధ్య దాదాపు ఐదేళ్లుగా యుద్ధం కొనసాగుతోంది. ఈ పోరుకు ముగింపు పలికేందుకు అమెరికా ఇటీవలి కాలంలో దౌత్యపరమైన ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున దౌత్యవేత్తగా వ్యవహరిస్తున్న స్టీవ్ విట్‌కాఫ్ బుధవారం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో విస్తృతంగా చర్చలు జరిపారు.
అంతకుముందు నార్వే రాజధాని ఓస్లోలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతోనూ సమావేశమయ్యారు.
ఈ భేటీలో యుద్ధ విరమణకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించారు.
ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లోనూ శాంతి ప్రయత్నాలు జరిగాయి.
అమెరికా, రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబూదాబీలో రెండుసార్లు, ఫిబ్రవరిలో స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో మరోసారి సమావేశమై యుద్ధ విరమణపై చర్చించారు.
వివరాలు
దౌత్య బృందాల మధ్య జరిగే చర్చలు సాంకేతిక అంశాలకే పరిమితం
అయితే, ఈ చర్చల్లో చెప్పుకోదగ్గ పురోగతి కనిపించలేదు.ఖైదీల మార్పిడికి మాత్రమే అంగీకారం కుదిరింది.
మరోవైపు, ఇరుదేశాల మధ్య దాడులు మాత్రం ఆగలేదు. ఈ పరిస్థితుల్లో బుధవారం పుతిన్ త్రైపాక్షిక చర్చలకు సూత్రప్రాయంగా అంగీకరించడం, ఆ వెంటనే ఉక్రెయిన్‌పై క్షిపణి దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే, శాంతి చర్చల విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇరుదేశాల అధ్యక్షులు నేరుగా ముఖాముఖి చర్చలు జరిపితేనే శాంతి ఒప్పందానికి అవకాశముంటుందని ఆయన చెబుతున్నారు.
దౌత్య బృందాల మధ్య జరిగే చర్చలు సాంకేతిక అంశాలకే పరిమితమవుతాయని పేర్కొంటున్నారు.
రష్యా తన వైఖరిని మార్చుకోలేదనేందుకు బుధవారం రాత్రి ఉక్రెయిన్‌లోని 12 ప్రాంతాలపై జరిగిన క్షిపణి దాడులే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
వివరాలు
21 క్షిపణులతో దాడులు
ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన జెలెన్‌స్కీ.. రష్యా దాడుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు చిన్నారులు సహా మొత్తం 34 మంది గాయపడినట్లు తెలిపారు.
బుధవారం రాత్రి మూడు దశల్లో మొత్తం 21 క్షిపణులతో దాడులు జరిగినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది.
ఈ దాడులతో కీవ్ నగరం భీకర శబ్దాలతో దద్దరిల్లిందని, అనేక భవనాలు, విద్యుత్ సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయని తెలిపింది.
కీవ్‌లో ఒకరు, ఖార్కివ్ పరిసర ప్రాంతాల్లో మరొకరు మరణించినట్లు పేర్కొంది.
రష్యా దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు మరిన్ని పాట్రియట్ వైమానిక రక్షణ వ్యవస్థలను అందించాలని, రష్యాపై అదనపు ఆంక్షలు విధించాలని జెలెన్‌స్కీ ఇప్పటికే పలుమార్లు అమెరికాను కోరారు.
వివరాలు
రష్యాపై విధించిన ఆంక్షలకు తాత్కాలికంగా మినహాయింపు
మరోవైపు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యాపై అనుసరిస్తున్న విధానాలు కూడా చర్చకు దారితీస్తున్నాయి.
ఇటీవలి పరిణామాల్లో ఆయన ఉక్రెయిన్‌కు దూరంగా, రష్యాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రష్యాపై విధించిన ఆంక్షలకు తాత్కాలికంగా మినహాయింపునిస్తూ, ఆ దేశం నుంచి డీజిల్ కొనుగోలుకు అనుమతించడం ఈ నేపథ్యంలో ప్రస్తావనకు వస్తోంది.
ఒకవైపు శాంతి చర్చలు సాగుతున్నప్పటికీ, మరోవైపు క్షిపణి దాడులు, డ్రోన్ దాడులు కొనసాగుతుండటంతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఎప్పుడు ముగింపు లభిస్తుందనే దానిపై స్పష్టత లేకుండా పోయింది.