Iran: ఇరాన్‌లో వరుస పేలుళ్లు.. తమకెలాంటి సంబంధం లేదన్న అమెరికా
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌లో గురువారం సాయంత్రం నుంచి పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలను స్థానిక మీడియాతో పాటు అక్కడి అధికారులు కూడా ధ్రువీకరించారు. బుషెహర్‌లో అణు విద్యుత్ కేంద్రం సమీపంలోని సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు ఆ ప్రాంత పొలిటికల్ అండ్ సెక్యూరిటీ గవర్నర్ ఇసన్ జహనియన్ వెల్లడించారు. అదే సమయంలో కొనారాక్‌లోని నౌకాదళ జోన్‌పై కూడా శత్రుదేశానికి చెందిన యుద్ధ విమానాలు రెండు విడతల్లో దాడులు జరిపినట్లు ఇరాన్ అధికారి మహమ్మద్ యూనిస్ హక్కానీ తెలిపారు. ఈ వరుస దాడులతో ఆయా ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు సమాచారం.
వివరాలు
90 లక్ష్యాలపై దాడులు
మరోవైపు, ఈ దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా స్పష్టం చేసింది. తాజాగా తమ సైన్యం ఇరాన్‌పై ఎలాంటి దాడులు నిర్వహించలేదని అమెరికా అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో అమెరికా మీడియాతో మాట్లాడిన ఓ ఇజ్రాయెల్ అధికారి కూడా ఈ దాడుల్లో తమ దేశ సైన్యం ప్రమేయం ఉన్నట్లు తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. అయితే బుషెహర్ ప్రాంతం ఇప్పటికే ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. గురువారం తెల్లవారుజామున జరిగిన దాడుల్లో కూడా బుషెహర్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నారని, ఆ సమయంలో అణు విద్యుత్ కేంద్రాన్నే టార్గెట్ చేసినట్లు ఇరాన్ ఆరోపించింది. కాగా, గురువారం మొత్తం 90 లక్ష్యాలపై దాడులు జరిగిన విషయం తెలిసిందే.