కిమ్‌కు ఏమైంది? 40రోజులుగా కనపడని ఉత్తర కొరియా అధ్యక్షుడు!
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌పై మళ్లీ ఉహాగానాలు వెలువడుతున్నాయి. ఆయన దాదాపు 40రోజులుగా బహిరంగంగా కనిపంచకపోవడంతో అనేక అనుమానాలు రేకేత్తుతున్నాయి. ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్‌లో ఈ వారం సామూహిక సైనిక కవాతును నిర్వహించనున్నారు. ఉత్తర కొరియా సైన్యం ఏర్పడి 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కవాతను నిర్వహించనున్నారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న కవాతుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో కిమ్ కనిపించకపోవడం గమనార్హం. ఆదివారం నిర్వహించిన పొలిట్‌బ్యూరో సమావేశానికి కూడా కిమ్ గైర్హాజరైనట్లు దక్షిణ కొరియాకు చెందిన ఎన్‌కే న్యూస్ వెల్లడించింది. అతను ఇలా చేయడం ఇది మూడోసారని నివేదించింది.
2022లో 70కి పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా
చాలా రోజులుగా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండటంపై ఆయన ఆరోగ్యంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2014తో కిమ్ 40రోజుల పాటు కనిపించకపోవడం ఇదే మొదటిసారి. బుధవారం ఉత్తర కొరియా సైన్యం 75వ వార్షికోత్సవాన్ని నిర్వహించే అవకాశం ఉంది. కవాతులో భాగంగా ఉత్తర కొరియా తన ఆయుధ శక్తిని ప్రపంచానికి చూపనుంది. ఇదిలా ఉంటే, గతవారం అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ దక్షిణ కొరియాను సందర్శించారు. దీన్ని ఉత్తర కొరియా ఖండించింది. అమెరికాపై తీవ్రస్థాయిలో మండిపడింది. 2022లో ఉత్తర కొరియా 70కి పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దక్షిణ కొరియాలోని లక్ష్యాలను ఛేదించడానికి, అమెరికా ప్రధాన భూభాగాన్ని చేరుకోగల అణ్వాయుధాలను ఉత్తర కొరియా రూపొందించి, అలాగే ప్రయోగాలను కూడా నిర్వహించింది.