అమెరికా దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ సీనియర్ లీడర్ సహా 11మంది హతం
ఉత్తర సోమాలియా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్)కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో ఐసీస్ సీనియర్ లీడర్‌తో పాటు మరో 10మంది మృతి చెందారు. ఐఎస్ఐఎస్ ఆర్థిక సహాయకారుడైన బిలాల్ అల్-సుదానిని లక్ష్యంగా చేసుకుని అమెరికా దళాలు ఈ దాడులు జరిపాయి. ఈ దాడుల్లో బిలాల్ అల్-సుదానిని మట్టుబెట్టినట్లు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ప్రకటించారు. అమెరికాతో పాటు మిత్ర దేశాలను మరింత సురక్షితంగా ఉంచేందుకే ఈ దాడులు చేసినట్లు లాయిడ్ ఆస్టిన్ పేర్కొన్నారు. అమెరికాతో పాటు విదేశాల్లో ఉంటున్న తమ పౌరులను ఉగ్రవాద దాడుల నుంచి రక్షించడమే తమ లక్ష్యం అన్నారు.
బిలాల్ అల్ సుదాని మట్టుబెట్టేందుకు గత వారమే ప్లాన్
బిలాల్ అల్ సుదానిని లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపే విషయంపై గత వారమే అమెరికా రక్షణ మంత్రితో పాటు చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్, ఆర్మీ జనరల్ మార్క్ మిల్లీతో అధ్యక్షుడు జో బైడెన్ చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ వారం ఆపరేషన్ చేయడానికి బైడెన్ ఆమోదం తెలపడంతో అమెరికా సైన్యం దాడులు చేసినట్లు ఇద్దరు సీనియర్ బిడెన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు చెప్పారు. కొన్నేళ్లుగా బిలాల్ అల్ సుదాని కదలికలను అమెరికా ఇంటెలిజెన్స్ పరిశీలిస్తోందని చెప్పారు లాయిడ్ ఆస్టిన్. ఆఫ్రికాలో ఐఎస్ కార్యకలాపాలతో పాటు ఆఫ్ఘనిస్తాన్‌లో పనిచేస్తున్న ఐఎస్‌ఐఎస్-కె ఉగ్రవాద శాఖకు నిధులు సమకూర్చడంలో బిలాల్ కీలక పాత్ర పోషించాడని ఆస్టిన్ చెప్పారు.