LOADING...
IND vs PAK: యూ టర్న్‌ పాక్‌దా? ఐసీసీదా? నజమ్‌ సేథీ వ్యాఖ్యలతో కొత్త వివాదం
యూ టర్న్‌ పాక్‌దా? ఐసీసీదా? నజమ్‌ సేథీ వ్యాఖ్యలతో కొత్త వివాదం

IND vs PAK: యూ టర్న్‌ పాక్‌దా? ఐసీసీదా? నజమ్‌ సేథీ వ్యాఖ్యలతో కొత్త వివాదం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 11, 2026
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

పూటకో మాట మార్చడం పాకిస్థాన్‌కు అలవాటే అన్న విమర్శలకు మరోసారి బలం చేకూరింది. ఈసారి ఆ వ్యాఖ్యలకు కారణమయ్యింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ నజమ్ సేథీ వ్యాఖ్యలే. ఇటీవల వరకు భారత్‌తో మ్యాచ్ ఆడబోమంటూ గట్టిగా ప్రకటించిన పాకిస్థాన్‌ చివరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)తో చర్చల టేబుల్ వద్దకు రావాల్సి వచ్చింది. భారత్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని ఐసీసీ హెచ్చరించడంతో పాకిస్థాన్‌ చివరకు వెనకడుగు వేసింది. అందరూ ఊహించినట్టుగానే తన నిర్ణయాన్ని మార్చుకుంది. అయితే ఈ వ్యవహారంలో పాకిస్థాన్‌ వెనక్కి తగ్గలేదని, అసలు ఐసీసీనే దిగివచ్చిందని నజమ్ సేథీ వాదించడం చర్చకు దారి తీసింది.

వివరాలు 

మ్యాచ్ ఆడకపోయినా తమపై ఎలాంటి ఆంక్షలు పడవు: సేథీ

ఈ అంశంపై ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సేథీ మాట్లాడుతూ, "నిజానికి ఈ వ్యవహారంలో వెనక్కి తగ్గింది ఐసీసీనే. బంగ్లాదేశ్ విషయంలో అది కొంత సానుకూల ధోరణి అవలంబించింది. భారత్‌తో మ్యాచ్ ఆడాలా వద్దా అన్న అంశంపై పాకిస్థాన్ చాలా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ ఆడకపోయినా తమపై ఎలాంటి ఆంక్షలు పడవని పాకిస్థాన్‌కు స్పష్టత ఉంది. దీనిపై దేశీయంగా, అంతర్జాతీయంగా అగ్రశ్రేణి న్యాయవాదులతో సంప్రదింపులు జరిపాం" అని తెలిపారు.

వివరాలు 

చర్చల మార్గాన్ని ఎంచుకున్న ఐసీసీ 

అంతేకాదు,"ఈ విషయంలో పాకిస్థాన్ బలమైన స్థితిలోనే ఉంది. అత్యధికంగా నష్టపోయేది ఒక పాయింట్ మాత్రమే. అంతకు మించి పెద్ద ప్రభావం ఏమీ ఉండదు. ఈ వాస్తవాన్ని ఐసీసీ కూడా గ్రహించినట్టుంది. అందుకే చర్చల మార్గాన్ని ఎంచుకుంది. ఐసీసీ డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖవాజా స్వయంగా రంగంలోకి దిగారు. భారత్‌తో మ్యాచ్ నిర్వహణపై పాకిస్థాన్‌కు వచ్చి చర్చలు జరిపారు" అని సేథీ వివరించారు. టీ20 వరల్డ్ కప్‌-2026లో బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తొలుత ప్రకటించింది. అయితే ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని మెగా టోర్నీకి సహఆతిథ్య దేశమైన శ్రీలంక పాకిస్థాన్‌ను కోరింది. గతంలో తమ దేశంలో ఉగ్రవాద దాడులు జరిగినప్పటికీ పాకిస్థాన్‌లో మ్యాచ్‌లు ఆడిన విషయాన్ని శ్రీలంక గుర్తుచేసింది.

Advertisement

వివరాలు 

బంగ్లాదేశ్‌కు మద్దతుగా తీసుకున్న నిర్ణయంగా చెప్పుకుంటున్న పాక్ 

భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగకపోతే వేల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉందని అంచనాలు వెలువడ్డాయి. దీంతో ఐసీసీ సభ్యదేశాలన్నీ పాకిస్థాన్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. ఈ పరిస్థితుల్లో శ్రీలంక సూచనను కూడా పట్టించుకోకపోతే మొదటికే మోసం వచ్చే అవకాశముందని, అంతర్జాతీయంగా తాము ఒంటరిగా మిగిలిపోతామని పాకిస్థాన్ ఆందోళన చెందింది. చివరకు తన కఠిన వైఖరిని వీడి భారత్‌తో మ్యాచ్‌కు అంగీకరించింది. అయితే పైకి మాత్రం ఈ నిర్ణయం తమ స్వప్రయోజనాల కోసం కాదని, పూర్తిగా బంగ్లాదేశ్‌కు మద్దతుగా తీసుకున్నదేనని చెప్పుకొచ్చింది.

Advertisement