LOADING...
Women's T20 World Cup: అందలాన ఆసీస్‌.. ఏడోసారి టీ20 ప్రపంచకప్‌ విజేతగా చరిత్ర
అందలాన ఆసీస్‌.. ఏడోసారి టీ20 ప్రపంచకప్‌ విజేతగా చరిత్ర

Women's T20 World Cup: అందలాన ఆసీస్‌.. ఏడోసారి టీ20 ప్రపంచకప్‌ విజేతగా చరిత్ర

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 06, 2026
09:25 am

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల క్రికెట్‌లో ఆస్ట్రేలియా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా మరో ఘనతను సొంతం చేసుకుంటూ ఏడోసారి మహిళల టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగగా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. కెప్టెన్‌ నాట్‌ సీవర్‌ 53 బంతుల్లో 5 ఫోర్లతో అజేయంగా 58 పరుగులు చేయగా, ఫ్రేయా కెంప్‌ 28 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 44 పరుగులు చేసింది. ఈ ఇద్దరూ చివరి వరకు నిలిచి జట్టుకు పోరాడే స్కోరు అందించారు.

వివరాలు 

తొలి ఓవర్‌ల్లోనే ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ

ఆస్ట్రేలియా బౌలర్లలో కిమ్‌ గార్త్‌, లూసీ, మోలనూ, అనాబెల్‌ సదర్లాండ్‌ తలో వికెట్‌ పడగొట్టి ఇంగ్లాండ్‌ను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు తొలి ఓవర్‌ల్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ జార్జియా వోల్‌ కేవలం 9 పరుగులకే లారెన్‌ బెల్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయింది. అయితే ఆ తర్వాత బెత్‌ మూనీ, ఫోబి లిచ్‌ఫీల్డ్‌ ఇంగ్లాండ్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఇద్దరూ దూకుడుగా ఆడుతూ స్కోరును వేగంగా ముందుకు తీసుకెళ్లారు. లారెన్‌ బెల్‌ వేసిన నాలుగో ఓవర్లో మూనీ వరుసగా మూడు బౌండరీలు బాదగా,తర్వాతి ఓవర్లో డీన్‌ బౌలింగ్‌లో లిచ్‌ఫీల్డ్‌ ఒక ఫోర్‌,ఒక సిక్సర్‌తో మెరిసింది.

వివరాలు 

38బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన బెత్‌ మూనీ

వీరిద్దరి అద్భుత భాగస్వామ్యంతో 10 ఓవర్ల ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 98/1తో విజయానికి చేరువైంది. అర్ధశతకానికి చేరువలో ఉన్న సమయంలో ఫోబి లిచ్‌ఫీల్డ్‌ 35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేసి వెనుదిరిగింది. మరోవైపు బెత్‌ మూనీ 38బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి మరింత దూకుడుగా ఆడింది. ముఖ్యంగా ఫ్రేయా కెంప్‌ వేసిన ఓవర్లో మూడు బౌండరీలు బాది మ్యాచ్‌ను పూర్తిగా ఆస్ట్రేలియా వైపు తిప్పింది. దీంతో సమీకరణం 36బంతుల్లో 22పరుగులకు చేరి మరింత సులభమైంది. విజయానికి చేరువలో మూనీ 49 బంతుల్లో 10 ఫోర్లతో 64 పరుగులు చేసి ఔటైనా,ఎలీస్‌ పెర్రీ అజేయంగా 13,ఆష్లీ గార్డ్‌నర్‌ అజేయంగా 3 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు.

Advertisement

వివరాలు 

బెత్‌ మూనీకి 'ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌'

చివరగా 18 బంతుల్లో 5 పరుగులు అవసరమైన దశలో సోఫీ ఎకిల్‌స్టోన్‌ బౌలింగ్‌లో తొలి బంతికి గార్డ్‌నర్‌ రెండు పరుగులు సాధించింది. ఆ తర్వాతి బంతి వైడ్‌గా వెళ్లి బౌండరీ చేరడంతో ఆస్ట్రేలియా 17.1 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫైనల్లో మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడిన బెత్‌ మూనీకి 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది. టోర్నీ మొత్తం 238 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన ఆమెకు 'ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌' (ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌) అవార్డూ దక్కింది.

Advertisement

వివరాలు 

సీవర్‌, ఫ్రేయా పోరాటం వృథా

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు అమీ జోన్స్‌ (6), డానీ వ్యాట్‌ (8) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌ చేరారు. అనంతరం అలీస్‌ క్యాప్సీ 23 పరుగులు చేసి ఔటవగా, హెదర్‌ నైట్‌ కేవలం 2 పరుగులకే వెనుదిరిగింది. దీంతో 10.5 ఓవర్లకే ఇంగ్లాండ్‌ 70/4తో కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట సమయంలో కెప్టెన్‌ నాట్‌ సీవర్‌ మరోసారి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లో రాణించిన ఫ్రేయా కెంప్‌ కూడా ఈ మ్యాచ్‌లో ధాటిగా బ్యాటింగ్‌ చేసింది. ఈ ఇద్దరూ చివరి వరకు అజేయంగా నిలిచి ఇంగ్లాండ్‌ స్కోరును 150 పరుగులకు చేర్చినా, ఆ లక్ష్యం ఆస్ట్రేలియా ముందు సరిపోలేదు.

Advertisement