LOADING...
Telangana : మేడారం జాతర: ఆర్టీసీకి రూ.20 కోట్లకు పైగా ఆదాయం
మేడారం జాతర: ఆర్టీసీకి రూ.20 కోట్లకు పైగా ఆదాయం

Telangana : మేడారం జాతర: ఆర్టీసీకి రూ.20 కోట్లకు పైగా ఆదాయం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 11, 2026
09:06 am

ఈ వార్తాకథనం ఏంటి

మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) రాష్ట్రవ్యాప్తంగా అన్ని రీజియన్ల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. జనవరి 26 నుంచి ఫిబ్రవరి 1 వరకు మొత్తం 4,000 ప్రత్యేక బస్సులు మేడారానికి రాకపోకలు సాగించాయి. వరంగల్‌ రీజియన్ పరిధిలోని 9 డిపోల కింద ఉన్న 51 ప్రాంతాల నుంచి ప్రత్యేక సర్వీసులు నడిపించడంతో సంస్థకు కోట్ల రూపాయల ఆదాయం లభించింది. వరంగల్‌ రీజియన్‌లో మొత్తం 1,711 బస్సులు 25,027 ట్రిప్పులు నిర్వహించి 28.06లక్షల కిలోమీటర్ల మేర రాకపోకలు సాగించాయి. ఈ సేవల ద్వారా రూ.20.24కోట్ల ఆదాయం సమకూరింది.జాతర కాలంలో మొత్తం 12.33 లక్షల మంది భక్తులను వారి గమ్యస్థానాలకు ఆర్టీసీ సురక్షితంగా చేర్చింది.

వివరాలు 

తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు పడిన భక్తులు 

మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండటంతో పురుషుల కంటే మహిళా ప్రయాణికులే అధికంగా బస్సుల్లో ప్రయాణించారు. మొత్తం ప్రయాణికుల్లో 6.80 లక్షల మంది మహిళలు ఉండగా, 5.53 లక్షల మంది పురుషులు రాకపోకలు సాగించారు. అయితే తిరుగు ప్రయాణ సమయంలో, ముఖ్యంగా 30, 31 తేదీల్లో ట్రాఫిక్‌ సమస్యలు తీవ్రంగా ఏర్పడ్డాయి. దీంతో బస్సులు సమయానికి రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. జాతర ముగిసిన తర్వాత అక్కడే మిగిలిపోయిన భక్తులను వారి స్వస్థలాలకు చేరవేయడంలో అధికారులు, ఆర్టీసీ విఫలమయ్యారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. జాతర నిర్వహణ వరకు మాత్రమే బస్సులు నడిపించి, అనంతరం బాధ్యత నుంచి తప్పుకున్నట్లుగా వ్యవహరించడంతో భక్తులు తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు పడ్డారు.

వివరాలు 

భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు: ఆర్టీసీ వరంగల్‌ ప్రాంతీయ మేనేజర్

ఈ విషయమై ఆర్టీసీ వరంగల్‌ ప్రాంతీయ మేనేజర్ డి. విజయభాను మాట్లాడుతూ, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, కండక్టర్లు, డ్రైవర్ల సమష్టి కృషితోనే జాతరను విజయవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని, నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించామని పేర్కొన్నారు. ఎక్కడా ప్రమాదాలు జరగకుండా బస్సు సేవలు అందించామని, అయితే ఈ జాతరలో తలెత్తిన కొన్ని లోపాలను గుర్తించి వాటిపై విశ్లేషణ చేస్తున్నామని స్పష్టం చేశారు.

Advertisement