Nepal: నేపాల్‌లో మళ్లీ వరదలు.. కొట్టుకుపోయిన ఇండ్లు, వంతెనలు
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్‌లో మరోసారి ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. గోర్ఖా జిల్లాలోని చుమ్నుబ్రి గ్రామం మీదుగా ప్రవహించే బుఢీ గండకి నదిలో ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో 40కిపైగా ఇళ్లు, వంతెనలు నీటిలో కొట్టుకుపోయాయి. ఓ జలవిద్యుత్ ప్రాజెక్టు కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. కొన్ని నెలల క్రితమే సంభవించిన భారీ విషాదం నుంచి ఇంకా తేరుకోకముందే ఈ ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
వివరాలు
పది నిమిషాల్లోనే భారీగా పెరిగిన నీటిమట్టం
ఆదివారం ఉదయం బుఢీ గండకి నదిలో నీటిమట్టం అనూహ్యంగా పెరిగింది.
ఉదయం 6.30 గంటలకు 3.66 మీటర్లుగా ఉన్న నీటిమట్టం.. 8.40గంటలకు ఏకంగా 8.43మీటర్లకు చేరింది.
సాధారణంగా ఈ నదిలో ఐదు మీటర్ల నీటిమట్టాన్ని ప్రమాద హెచ్చరిక స్థాయిగా పరిగణిస్తారు.
అయితే, ఉదయం 8.30 నుంచి 8.40 గంటల మధ్య కేవలం పది నిమిషాల్లోనే నీటిమట్టం రెండు మీటర్లకు పైగా పెరిగినట్లు నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఆర్‌ఆర్‌ఎంఏ) వెల్లడించింది.
వరద ఉద్ధృతితో నది ప్రవాహం పూర్తిగా మారిపోయింది.నల్లటి,బూడిద రంగుల్లో చిక్కటి బురద, చెత్తాచెదారంతో కూడిన నీరు వేగంగా ప్రవహించింది.
ఈ ఆకస్మిక వరదల కారణంగా ఇళ్లు,వంతెనలు దెబ్బతినడంతో పాటు జలవిద్యుత్ ప్రాజెక్టుపైనా తీవ్ర ప్రభావం పడింది.
వివరాలు
నదికి అడ్డుకట్ట తెగడమే కారణమా?
ఈ వరదలకు వర్షాలు కారణం కాదని ఎన్‌డీఆర్‌ఆర్‌ఎంఏ స్పష్టం చేసింది.
నదికి ఎక్కడైనా అడ్డుకట్ట ఏర్పడి, అది ఒక్కసారిగా తెగిపోవడం వల్లే వరదలు సంభవించి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
అయితే, దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వరద ఉద్ధృతికి నీటిమట్టాన్ని కొలిచే కేంద్రంతో పాటు ఓ వంతెన కూడా కొట్టుకుపోయింది.
దీంతో నదిలో నీటి ప్రవాహానికి సంబంధించిన వివరాలను సేకరించడం అధికారులకు కష్టంగా మారింది.
వివరాలు
ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
అయితే, నదీ పరీవాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు.
వరదల సమాచారం అందిన వెంటనే నేపాల్ సైన్యం రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించింది.
కొన్ని నెలల క్రితం జరిగిన విషాదం తర్వాత మళ్లీ ఇలాంటి ఆకస్మిక వరదలు సంభవించడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.
నదిలో నీటిమట్టం వేగంగా పెరగడానికి గల కారణాలను గుర్తించడంతో పాటు, ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేయడం ప్రస్తుతం కీలకంగా మారింది.