LOADING...
Nepal: నిరుద్యోగంపై ఆగ్రహం.. నేపాల్ ప్రధాని బాలేంద్ర షాకు పెరుగుతున్న వ్యతిరేకత
నిరుద్యోగంపై ఆగ్రహం.. నేపాల్ ప్రధాని బాలేంద్ర షాకు పెరుగుతున్న వ్యతిరేకత

Nepal: నిరుద్యోగంపై ఆగ్రహం.. నేపాల్ ప్రధాని బాలేంద్ర షాకు పెరుగుతున్న వ్యతిరేకత

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 13, 2026
10:44 am

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్ రాజకీయాలు మరోసారి ఉద్రిక్తంగా మారాయి.ప్రధానమంత్రి బాలేంద్ర షా రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగింది. నిరుద్యోగం రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ పలుచోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు యువకులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా,వారిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి.బాలేంద్ర షా అధికారంలోకి రావడానికి నేపాల్‌లో జరిగిన జెన్-జీ ఉద్యమం కీలక పాత్ర పోషించింది. 2025 సెప్టెంబరులో అప్పటి ప్రధానమంత్రి కె.పి. శర్మ ఓలి ప్రభుత్వం సోషల్ మీడియాపై ఆంక్షలు విధించడం,అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో యువత పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టింది.

వివరాలు 

ప్రజాస్వామ్య ఉద్యమానికి బాలేంద్ర షా బహిరంగ మద్దతు

ఆ ప్రజాస్వామ్య ఉద్యమానికి బాలేంద్ర షా బహిరంగంగా మద్దతు తెలపడంతో యువత ఆయనకు అండగా నిలిచింది. ఆ ఉద్యమం ప్రభావంతో అప్పటి ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో బాలేంద్ర షా నాయకత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 275 స్థానాలున్న నేపాల్ పార్లమెంట్‌లో ఆ పార్టీ 182 సీట్లను కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో బాలేంద్ర షా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

వివరాలు 

ప్రధానమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పలుచోట్ల నిరసనలు

అయితే అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ప్రధానమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పలుచోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ముగ్గురు యువకులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, వారిలో ఇద్దరు మరణించడం పరిస్థితి తీవ్రతను ప్రతిబింబిస్తోంది.

Advertisement

వివరాలు 

నేపాలీ కాంగ్రెస్ కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

ఈ పరిణామాలపై జెన్-జీ నేపాల్ సంస్థ కూడా తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ నిరంకుశ ధోరణిలో వ్యవహరిస్తోందని ఆ సంస్థ ఆరోపించింది. యువతకు ఉపాధి కల్పించడం, ఆదాయ వనరులు పెంచడం కోసం సమర్థవంతమైన బడ్జెట్, స్పష్టమైన విధానాలు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించింది. ఇదే అంశంపై ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్ కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించింది. యువతలో ఆశ, విశ్వాసాన్ని నింపేలా పాలన సాగించడంలో ప్రభుత్వం విఫలమైందని, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు అవసరమని పేర్కొంది. దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement