Jensen Huang: ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్‌కు పదవీ గండం.. కంపెనీ ఉద్యోగినితోనూ అఫైర్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే ప్రముఖ చిప్ తయారీ సంస్థల్లో ఒకటైన ఎన్విడియా (Nvidia)లో ఇప్పుడు అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంస్థ సీఈవో జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలు ఇప్పుడు ఆయన పదవికే ఎసరు తెచ్చేలా కనిపిస్తున్నాయి. చైనా గూఢచారిగా అనుమానిస్తున్న మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు గతంలో అంగీకరించిన ఆయనకు, తాజాగా మరో మహిళతోనూ సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో హువాంగ్‌ను సీఈవో పదవి నుంచి తప్పించే అంశంపై సంస్థ బోర్డు ఆలోచిస్తున్నట్లు సమాచారం.
వివరాలు
కింబర్లీ పావెల్‌తోనూ హువాంగ్‌కు వివాహేతర సంబంధం
వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. జెన్సన్ హువాంగ్ భవిష్యత్తుపై చర్చించేందుకు ఎన్విడియా డైరెక్టర్ల బోర్డు సమావేశమయ్యే అవకాశం ఉంది.
సంస్థ హెల్త్‌కేర్ విభాగంలో ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్న కింబర్లీ పావెల్‌తోనూ హువాంగ్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు తాజాగా ఆరోపణలు వచ్చాయి.
సంస్థలో గతంలో పనిచేసిన ఐదుగురు వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ కథనాన్ని ప్రచురించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.
అంతేకాకుండా ఓ కార్యక్రమంలో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న దృశ్యాలను కూడా పరిశీలించినట్లు పేర్కొంది.
ఈ ఆరోపణలు ఎన్విడియాలో హువాంగ్ నాయకత్వంపై కొత్త సందేహాలను రేకెత్తిస్తున్నాయి.
వివరాలు
భార్య, పిల్లలు బాధపడ్డారని విచారం
మరోవైపు, తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో జెన్సన్ హువాంగ్ సంస్థ ఉద్యోగులకు ప్రత్యేక సందేశం పంపారు.
తన భార్యకు నమ్మకద్రోహం చేసిన విషయాన్ని అంగీకరించిన ఆయన.. తన చర్యల వల్ల భార్య, పిల్లలు బాధపడ్డారని విచారం వ్యక్తం చేశారు.
అయితే ఈ వివాదం కేవలం ఆయన వ్యక్తిగత జీవితానికే పరిమితం కావడం లేదు.
సంస్థ ప్రతిష్ఠ, పాలనాపరమైన బాధ్యతలు, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు కూడా ఇందులో ప్రస్తావనకు వస్తున్నాయి.
దీంతో ఎన్విడియాలో పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారడంతో పాటు రాజకీయంగానూ చర్చకు దారితీస్తున్నాయి.