LOADING...
Germany: జర్మనీలో భారీ బ్యాంక్ దోపిడీ.. రూ.300 కోట్ల సొత్తు ఎత్తుకెళ్లిన దుండగులు
జర్మనీలో భారీ బ్యాంక్ దోపిడీ.. రూ.300 కోట్ల సొత్తు ఎత్తుకెళ్లిన దుండగులు

Germany: జర్మనీలో భారీ బ్యాంక్ దోపిడీ.. రూ.300 కోట్ల సొత్తు ఎత్తుకెళ్లిన దుండగులు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 31, 2025
11:08 am

ఈ వార్తాకథనం ఏంటి

జర్మనీలోని గెల్సెన్‌కిర్చెన్ పట్టణంలో హాలీవుడ్ చిత్రం 'ఓషన్స్ ఎలెవన్'ను తలపించే విధంగా సంచలన దోపిడీ జరిగింది. క్రిస్మస్ పండగ సెలవులను అవకాశంగా మార్చుకున్న దుండగులు ఒక బ్యాంకును లక్ష్యంగా చేసుకుని భారీగా దోచుకున్నారు. బ్యాంకులోని వేలాది లాకర్లను తెరిపించి సుమారు 35 మిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.300 కోట్ల విలువైన నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను కొల్లగొట్టారు. ఈ ఘటన పశ్చిమ జర్మనీలో ఉన్న స్పార్కాస్సే సేవింగ్స్ బ్యాంక్ బ్రాంచ్‌లో చోటుచేసుకుంది. క్రిస్మస్ సందర్భంగా గురువారం నుంచి ఆదివారం వరకు బ్యాంకుకు వరుస సెలవులు ఉండటంతో దుండగులకు పని సులువైంది.

వివరాలు 

ఫైర్ అలారం మోగడంతో.. సంఘటనా స్థలానికి  పోలీసులు 

ఈ అవకాశం తీసుకున్న వారు సమీపంలోని ఒక పార్కింగ్ గ్యారేజ్ నుంచి బ్యాంకు అండర్‌గ్రౌండ్ వాల్ట్ గదివరకు పెద్ద డ్రిల్లింగ్ యంత్రాలతో సొరంగం తవ్వారు. బ్యాంకులో ఉన్న మొత్తం 3250 సేఫ్ డిపాజిట్ బాక్సుల్లో 95 శాతం పైగా,అంటే 3000కు మించిన లాకర్లను పగులగొట్టి అందులో ఉన్న సంపదను పూర్తిగా ఎత్తుకెళ్లారు. సోమవారం తెల్లవారుజామున ఫైర్ అలారం మోగడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పుడే ఈ భారీ దోపిడీ వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా చూస్తే,నిందితులు ముఖాలకు మాస్కులు ధరించి బ్లాక్ కలర్ ఆడి ఆర్‌ఎస్ 6(Audi RS 6)కారులో పరారయ్యారు. ఈ చోరీకి ఉపయోగించిన వాహనానికి సంబంధించిన నంబర్ ప్లేట్ కూడా వారు ముందుగానే దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు.

వివరాలు 

తీవ్ర ఆందోళనలో కస్టమర్లు 

ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్పార్కాస్సే సేవింగ్స్ బ్యాంక్ బ్రాంచ్‌లో ఖాతాలు కలిగిన కస్టమర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే వందలాది మంది బ్యాంకు ముందు చేరి తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమ లాకర్లలో ఉన్న ఆస్తి విలువ ఇన్సూరెన్స్ పరిమితిని మించిపోయిందని చాలామంది వాపోతున్నారు. అత్యంత పక్కా ప్రణాళికతో, వృత్తిపరంగా అమలు చేసిన ఈ దోపిడీని చూసి పోలీసులు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జర్మనీలో భారీ బ్యాంక్ దోపిడీ

Advertisement