LOADING...
Jeffrey Sachs: ఇరాన్ యుద్ధాన్ని ఆపగల శక్తి మోదీ,పుతిన్,జిన్‌పింగ్‌కే ఉంది: జెఫ్రీ సాచ్స్
ఇరాన్ యుద్ధాన్ని ఆపగల శక్తి మోదీ,పుతిన్,జిన్‌పింగ్‌కే ఉంది: జెఫ్రీ సాచ్స్

Jeffrey Sachs: ఇరాన్ యుద్ధాన్ని ఆపగల శక్తి మోదీ,పుతిన్,జిన్‌పింగ్‌కే ఉంది: జెఫ్రీ సాచ్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 06, 2026
12:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం ప్రపంచాన్ని తీవ్రఆందోళనకు గురి చేస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దళాలు ఇరాన్‌పై కొనసాగిస్తున్న దాడులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో,ఈ యుద్ధాన్ని ఆపగల సామర్థ్యం భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లకు మాత్రమే ఉందని అమెరికా ఆర్థికవేత్త, ప్రొఫెసర్ జెఫ్రీ సాచ్స్ అభిప్రాయపడ్డారు. న్యూఆర్డర్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ,ప్రపంచాన్ని విధ్వంసం నుంచి కాపాడే శక్తి ఈ ముగ్గురు నేతలకే ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయస్థాయిలో వీరికి మంచి గుర్తింపు ఉందని,రాజకీయ పరిపక్వత కలిగిన నాయకులని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా దూకుడును అడ్డుకునే శక్తి కూడా ఈముగ్గురు నేతలకే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

వివరాలు 

అమెరికా విధానాలకు వ్యతిరేకంగా స్పందించే శక్తి, స్థాయి భారత్‌కు ఉంది 

ఇరాన్ యుద్ధాన్ని నిలిపివేయాలంటే ప్రభావవంతమైన నాయకత్వం అవసరమని, ప్రస్తుతం ప్రపంచంలో ఆ స్థాయి సామర్థ్యం ఉన్నవారు ఈ ముగ్గురేనని సాచ్స్ స్పష్టం చేశారు. భారత ప్రధాని మోదీ,రష్యా అధ్యక్షుడు పుతిన్,చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మూడు ప్రధాన శక్తివంతమైన దేశాలకు నాయకత్వం వహిస్తున్నారని, వీరు కలిసి పనిచేస్తే ప్రపంచాన్ని వినాశనం నుంచి రక్షించగలరన్నారు. బ్రిక్స్ వంటి వేదికల ద్వారా ఈ యుద్ధాన్ని అడ్డుకునే అవకాశం ఉందని ఆయన సూచించారు. భౌగోళికంగా,నాగరికత పరంగా భారత్‌కు విశేష అనుభవం ఉందని,ఇలాంటి కీలక సమయంలో భారత్ నిష్క్రియగా ఉండకూడదని సాచ్స్ అన్నారు. అమెరికా విధానాలకు వ్యతిరేకంగా స్పందించే శక్తి, స్థాయి భారత్‌కు ఉందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభాన్ని తగ్గించేందుకు భారత్,చైనా,రష్యా కలిసి సంయుక్త నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

వివరాలు 

బ్రిక్స్ దేశాలు కలిసివస్తే..

భారత్ దృఢమైన దౌత్య విధానాన్ని అనుసరించాలని, ప్రాంతీయ సంబంధాలను సమర్థంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ఇరాన్‌తో భారత్‌కు ఉన్న దీర్ఘకాల సంబంధాలను దృష్టిలో పెట్టుకుని బహుముఖ విధానాన్ని అవలంబించాలని చెప్పారు. బ్రిక్స్ దేశాలు కలిసివస్తే అమెరికాను వ్యూహాత్మకంగా నియంత్రించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కొందరి స్వార్థపూరిత నిర్ణయాల ఫలితమని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని సాచ్స్ విమర్శించారు.

Advertisement

వివరాలు 

మానవ, ఆర్థిక సంక్షోభం ఏర్పడే ప్రమాదం

దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా మానవ, ఆర్థిక సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయని, వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రపంచం తీవ్రమైన సంక్షోభంలోకి జారిపోతుందని పేర్కొన్నారు. ఇది ఒక్క దేశం చేసిన పొరపాటు కాదని, ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే సంక్షోభమని ఆయన తెలిపారు. ఇరాన్‌పై పూర్తి స్థాయి దాడి జరిగితే ప్రపంచ ఇంధన వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని సాచ్స్ హెచ్చరించారు.

Advertisement