Loading...
Pakistan: పాకిస్థాన్‌లో ఉగ్రదాడి.. డీఎస్పీ సహా 10 మంది పోలీసుల మృతి
పాకిస్థాన్‌లో ఉగ్రదాడి.. డీఎస్పీ సహా 10 మంది పోలీసుల మృతి

Pakistan: పాకిస్థాన్‌లో ఉగ్రదాడి.. డీఎస్పీ సహా 10 మంది పోలీసుల మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2026
02:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో పోలీసు బృందాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP), సబ్‌ ఇన్‌స్పెక్టర్ సహా కనీసం 10 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం అక్రమ బంగారం తవ్వకాలపై చర్యలు తీసుకునేందుకు వెళ్తున్న పోలీసు బృందంపై దుండగులు మాటువేసి కాల్పులు జరిపారు. కోహాట్, కరక్ జిల్లాల మధ్య ఉన్న దర్బోకచ్ జలంధర్ బండా ప్రాంతంలో ఈ దాడి చోటుచేసుకుంది. పోలీసు ప్రతినిధి మహమ్మద్ నౌమాన్ జెబ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పోలీసు బృందం కోహాట్ జిల్లాలోని గుంబాట్ ప్రాంతానికి వెళ్తుండగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు.

వివరాలు 

ఐదు పోలీసు మొబైల్ వాహనాలకు నిప్పంటించిన ఉగ్రవాదులు

కొండ ప్రాంతాల్లోని ఎత్తైన ప్రదేశాల నుంచి పోలీసులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు సమాచారం.

ఈ దాడిలో పలువురు పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. పోలీసు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.

మృతుల్లో గంబాట్ డీఎస్పీ హైదర్ జమాన్,సబ్‌ ఇన్‌స్పెక్టర్ ముఖ్తియార్‌తో పాటు ఇతర పోలీసు సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

దాడి సమయంలో ఉగ్రవాదులు ఐదు పోలీసు మొబైల్ వాహనాలకు నిప్పంటించారు.

అనంతరం పోలీసులపై కాల్పులు కొనసాగించడంతో ఇరువర్గాల మధ్య తీవ్రంగా కాల్పులు జరిగినట్లు పోలీసు ప్రతినిధి తెలిపారు.

ఘటన గురించి సమాచారం అందిన వెంటనే అదనపు పోలీసు వాహనాలతో పాటు భారీ సంఖ్యలో భద్రతా బలగాలను అక్కడికి పంపించారు.

దాడికి పాల్పడిన వారిని గుర్తించి పట్టుకునేందుకు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు.

వివరాలు 

ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి: ఫైసల్ కరీం కుండీ

ఈ ఘటనపై ఖైబర్ పఖ్తుంఖ్వా గవర్నర్ ఫైసల్ కరీం కుండీ తీవ్రంగా స్పందించారు.

ఉగ్రదాడిని ఖండించిన ఆయన.. నేరస్థులు, ఉగ్రవాదుల మధ్య ఉన్న సంబంధాన్ని ఈ ఘటన ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించారు.

ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అధికారుల సేవలను కొనియాడారు.

ADVERTISEMENT

వివరాలు 

జమ్మూకశ్మీర్‌లోనూ సీఆర్పీఎఫ్ సిబ్బందిపై కాల్పులు

మరోవైపు పాకిస్థాన్‌లో ఉగ్రదాడి జరిగిన రోజే జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోనూ భద్రతా సిబ్బందిపై దాడి జరిగింది.

మిర్‌బజార్ సమీపంలోని అఖ్రాన్ ప్రాంతంలో ఉన్న సీఆర్పీఎఫ్ (CRPF) చెక్‌పాయింట్‌పై మోటార్‌సైకిళ్లపై వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు.

బుధవారం మధ్యాహ్నం సుమారు 2.15 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.

ఈ కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. వెంటనే వారిని అనంత్‌నాగ్‌లోని ఆసుపత్రికి తరలించారు.

క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

కాల్పుల అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దాడికి పాల్పడిన వారిని గుర్తించి పట్టుకునేందుకు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.

ADVERTISEMENT