USA: చికాగో సమీపంలో కాల్పులు..8 మందిమృతి,నిందితుడి కోసం పోలీసులు వేట
అమెరికాలోని చికాగో సమీపంలోని రెండు వేర్వేరు ఇళ్లలో జరిగిన కాల్పుల్లో కనీసం ఎనిమిది మంది మరణించారని అధికారులు మంగళవారం తెలిపారు. ఇల్లినాయిస్ రాష్ట్రంలో జోలియట్‌లోని వెస్ట్ ఎకర్స్ రోడ్‌లోని 2200 బ్లాక్‌లో ఆది, సోమవారాల్లో కాల్పులు జరిగాయి. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితుడిని రోమియో నాన్స్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. రెండు నివాసాలలో కలిపి మొత్తం ఎనిమిది మంది వ్యక్తులను కాల్చినట్లు జోలియట్‌లోని పోలీసు చీఫ్ బిల్ ఎవాన్స్ ఒక వార్తా సమావేశంలో చెప్పారు.
మృతి చెందిన వారికీ నిందితుడికి ముందే పరిచయం
మరణించిన వారితో రోమియో నాన్స్‌కి ముందు నుంచే పరిచయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం నుంచే ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నప్పటికీ.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాన్స్ ఎరుపు రంగు టయోటా క్యామ్రీని నడుపుతున్నట్లు తెలిసిందని, అందులోను అతను మరణాయుధాలతో తప్పించుకు తిరుగుతున్నట్లు జోలియట్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. నాన్స్ కి సంబంధించిన సమాచారం ఎవరికైనా ఉంటే వెంటనే తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. అమెరికన్ తుపాకీ హింస సంఘటనలను నివేదించే గన్ వయలెన్స్ ఆర్కైవ్ సేకరించిన డేటా ప్రకారం, ఈ సంవత్సరం మొదటి మూడు వారాల్లో 875 తుపాకీ మరణాలు సంభవించాయి.