Putin: ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు ట్రంప్, జిన్‌పింగ్‌తో పుతిన్ చర్చలు?
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొత్త ప్రతిపాదన చేసినట్లు 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' (WSJ) ఓ కథనంలో వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో కలిసి వచ్చే నెలలో త్రైపాక్షిక సమావేశం నిర్వహించి ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించాలని పుతిన్ ప్రతిపాదించినట్లు పేర్కొంది. ఈ చర్చల ద్వారా మాస్కోకు అనుకూలంగా ఉండే శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని రష్యా భావిస్తున్నట్లు తెలిపింది. ట్రంప్‌తో మెరుగవుతున్న సంబంధాలను ఉపయోగించుకుని ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లేందుకు పుతిన్ ప్రయత్నిస్తున్నారని, అయితే ఈ చర్చల్లో ఉక్రెయిన్‌కు ప్రాతినిధ్యం లేకపోవడం ఆ దేశంతో పాటు అమెరికా యూరోపియన్ మిత్రదేశాల్లోనూ ఆందోళన కలిగిస్తోందని కథనం పేర్కొంది.
వివరాలు
ట్రంప్‌తో ఫోన్ చర్చల్లో పుతిన్ ప్రతిపాదన
అక్టోబర్ 9న ట్రంప్‌తో జరిగిన ఫోన్ సంభాషణలో పుతిన్ తొలిసారిగా ఈ త్రైపాక్షిక సమావేశం ఆలోచనను ప్రస్తావించినట్లు రష్యా నిఘా విభాగంలో గతంలో పనిచేసిన ఓ అధికారి వెల్లడించారని WSJ తెలిపింది.
అదే ఫోన్ సంభాషణలో రష్యా నుంచి డీజిల్ ఇంధనాన్ని కొనుగోలు చేసి, అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేసేందుకు అమెరికాకు అనుమతించే అంశంపై కూడా అంగీకారం కుదిరినట్లు పేర్కొంది.
సమావేశం నిర్వహించే అవకాశంపై చర్చలు జరుగుతున్నాయని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ధ్రువీకరించారు.
అయితే, భేటీ జరిగే విషయంపై లేదా దాని అజెండాపై ఇంకా స్పష్టత లేదని చెప్పారు.
ముగ్గురు నేతల మధ్య సమావేశం జరిగే అవకాశమున్నప్పటికీ, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు.
వివరాలు
ఏపీఈసీ సదస్సు వేళ త్రైపాక్షిక భేటీకి ప్రతిపాదన
ట్రంప్ ఈ సమావేశానికి అధికారికంగా అంగీకరించలేదని అమెరికా ఉన్నతాధికారి ఒకరు WSJకి తెలిపారు.
అయితే, యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో ఈ ప్రతిపాదనపై ఆయన సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
నవంబర్ 18, 19 తేదీల్లో చైనాలోని షెన్‌జెన్ నగరంలో జరగనున్న ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) సదస్సు సందర్భంగా ఈ ముగ్గురు నేతల సమావేశాన్ని నిర్వహించాలని క్రెమ్లిన్ సూచించినట్లు చర్చలతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.
మాస్కో, బీజింగ్ మధ్య జరిగిన చర్చల వివరాలు తెలిసిన వ్యక్తుల ప్రకారం, రష్యా దౌత్యవేత్తలు ఈ ప్రతిపాదనను చైనా అధికారుల ముందుంచారు.
ట్రంప్ పాల్గొనేందుకు అంగీకరిస్తే తమకు అభ్యంతరం లేదని చైనా వర్గాలు సంకేతాలిచ్చినట్లు సమాచారం.
వివరాలు
ఉక్రెయిన్ యుద్ధంపై చర్చల్లో పురోగతి: ట్రంప్
ఇదిలా ఉండగా,రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న చర్చల్లో మంచి పురోగతి కనిపిస్తోందని ట్రంప్ ఆదివారం తెలిపారు.
మాస్కోతో దౌత్యపరమైన చర్చలు జరుపుతున్న తన ప్రభుత్వ విధానాన్ని సమర్థించుకున్నఆయన.. రెండేళ్ల క్రితమే మెరుగైన ఒప్పందాన్ని సాధించడంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ విఫలమయ్యారని ఆరోపించారు.
తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో స్పందించిన ట్రంప్.. రష్యా శాంతి చర్చలకు దూరమయ్యేలా వ్యవహరించడం సరికాదని ట్రంప్ పేర్కొన్నారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరేలా తాను ప్రయత్నిస్తున్నానని,బందీల విడుదలపై జరుగుతున్న చర్చల్లోనూ మంచి పురోగతి కనిపిస్తోందని ట్రంప్ తెలిపారు.
సంబంధిత పత్రంపై తాను ఎప్పుడైనా సంతకం చేయగలనని,అయితే ప్రస్తుతం అలా చేస్తే రష్యా చర్చల నుంచి వెనక్కి వెళ్లే అవకాశం ఉందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
వివరాలు
ట్రంప్-పుతిన్ మధ్య స్నేహపూర్వక చర్చలు..
అంతకుముందు ట్రంప్,పుతిన్ మధ్య గంటన్నరపాటు ఫోన్ సంభాషణ జరిగినట్లు రష్యా అధ్యక్షుడి సహాయకుడు యూరీ ఉషకోవ్ శనివారం తెలిపారు.
ఈ చర్చలు సుదీర్ఘంగా,స్నేహపూర్వక వాతావరణంలో జరిగాయని, ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారం, ఇంధన సరఫరాలు, అంతర్జాతీయ అంశాలపై చర్చించారని చెప్పారు.
ఇరు దేశాల మధ్య సమాచార మార్పిడి మార్గాలు సక్రమంగా పనిచేస్తున్నాయని ఇద్దరు నేతలూ సంతృప్తి వ్యక్తం చేసినట్లు వివరించారు.
రష్యా నుంచి అమెరికాకు, ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా చేసే అవకాశాలపైనా చర్చించినట్లు తెలిపారు.
రాబోయే ఏపీఈసీ సదస్సుకు ఇద్దరు నేతలూ హాజరైతే, అక్కడ ముఖాముఖిగా సమావేశమయ్యే అవకాశం ఉందని ఉషకోవ్ పేర్కొన్నారు.
అయితే, భేటీకి సంబంధించి నిర్దిష్ట తేదీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
వివరాలు
డీజిల్ సరఫరాపై ఒప్పందం..
ఈ ఫోన్ సంభాషణ అనంతరం రష్యా నుంచి 3 లక్షల టన్నులకు పైగా డీజిల్ ఇంధనం అమెరికా, అంతర్జాతీయ మార్కెట్లకు తక్షణమే సరఫరా కానుందని, రానున్న నెలల్లో మరిన్ని సరఫరాలు ఉంటాయని ట్రంప్ ప్రకటించినట్లు కథనం తెలిపింది.
మరోవైపు, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు అమెరికాలో పర్యటించారు.
ఆ సమయంలో ట్రంప్‌తో వ్యూహాత్మక అంశాలు, చైనా-అమెరికా సంబంధాలు, ప్రపంచ పరిస్థితులపై స్నేహపూర్వక వాతావరణంలో విస్తృతంగా చర్చించినట్లు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వెల్లడించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్ ప్రతిపాదించిన త్రైపాక్షిక సమావేశం కార్యరూపం దాల్చుతుందా? ఒకవేళ జరిగితే శాంతి ఒప్పంద దిశగా ఎలాంటి పురోగతి సాధ్యమవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.