Houthi Rebels: భారత్‌కు వస్తున్న ఇజ్రాయెల్ కార్గో షిప్‌ను హైజాక్ చేసిన హౌతీ తిరుగుబాటుదారులు
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ప్రపంచం అంతా విస్తరిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ కార్గో షిప్‌ను హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు. ఈ విషయాన్ని తిరుగుబాటుదారులు ధృవీకరించారు. ఆ కార్గో షిప్ టర్కీ నుంచి ఇండియాకు బయలు దేరిన నేపథ్యంలో తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా హౌతీ మిలటరీ ప్రతినిధి యెహ్యా సరియా కీలక ప్రకటన చేశారు. ఎర్ర సముద్రంలో సైనిక చర్యను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగానే ఇజ్రాయెల్ కార్గో షిప్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు.
హౌతీ మిలటరీకి ఇజ్రాయెల్ హెచ్చరిక
గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దురాక్రమణ ఆగిపోయే వరకు తాము సైనిక కార్యకలాపాలను కొనసాగిస్తామని హౌతీ మిలటరీ చెప్పింది. దక్షిణ ఎర్ర సముద్రంలోని యెమెన్ సమీపంలో టర్కీ నుంచి భారత్‌కు వెళ్తున్న కార్గో షిప్‌ను హౌతీ మిలిటెంట్లు హైజాక్ చేశారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఆదివారం ధృవీకరించింది. హైజాక్ అనేది చిన్న విషయం కాదని, ప్రపంచ స్థాయిలో చాలా తీవ్రమైన సంఘటన ఐడీఎఫ్ హెచ్చరించింది. కార్లను రవాణా చేసే కార్గో షిప్ అయిన గెలాక్సీ లీడర్ హైజాక్ అయినట్లు ఐడీఎఫ్ గుర్తించింది. 2014లో యెమెన్ అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హౌతీ మిలీషియా ఎర్ర సముద్రపు ఓడరేవు నగరం హోడెయిడాతో సహా యెమెన్ ఉత్తరాన చాలా వరకు తన నియంత్రణలోకి తెచ్చుకుంది.