Rishi sunak-Britan: బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ కు ఎన్నికల్లో గడ్డు కాలమే...సర్వేల్లో వెల్లడి
భారత సంతతికి చెందిన బ్రిటన్ (Britan) ప్రధాని రిషీ సునాక్ (Rishi sunak) రోజురోజుకూ ప్రజాదరణ కోల్పోతున్నారు. బ్రిటన్ లో వచ్చే ఎన్నికల్లో ఆయన ఓడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హామీలు నెరవేర్చడంలో ఆయన పూర్తిగా విఫలమైనట్లు ప్రజాభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఆయనకు వచ్చే ఎన్నికల్లో ఓటమి చెందే అవకాశాలున్నాయని చెబుతున్నారు. బ్రిటన్ ప్రధాని పదవీ బాధ్యతలు తీసుకున్న ఏడాదిన్నర కాలంలోనే ఆయన పన్నుల పై కోత విధించి దేశ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేశారు. అయినప్పటికీ ఈ చర్యలు సునాక్ కు రాజకీయ ప్రయోజనం చేకూర్చలేదని వారు అభిప్రాయపడుతున్నారు. 14 ఏళ్లుగా బ్రిటన్ లో అధికారంలో ఉన్న కన్సర్వేటివ్ పార్టీని గద్దె దించాలని ప్రజలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
సర్వేలో 154 సీట్లే వచ్చాయి...
గత నెలలో జరిగి యుగెవ్ సర్వే ప్రకారం రిషీ సునాక్ పార్టీకి 154 సీట్లు, కీర్ స్టేమర్ ఆధ్వరంలోని ప్రతిపక్ష లేబర్ పార్టీకి 403 సీట్లు గెలుచుకునే అవకాశమున్నట్లు వెల్లడించింది. రిషీ సునాక్ ఇచ్చిన హామీ మేరకు దేశంలో వలసలను ఆపటంలో ఆయన విఫలమైయ్యారు. ఇప్పటికీ ఫ్రాన్స్ నుంచి కాందిశీకులు బ్రిటన్ కు బోట్లలో వస్తూనే ఉన్నారు. ద్రవ్యోల్బణం తగ్గి ధరలు అదుపులోకి వచ్చినప్పటికీ ఆర్థికంగా మాత్రం బలం పుంజుకోలేకపోవడం రిషీ సునాక్ కు ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో రిషీ సునాక్ గడ్డు పరిస్థితిని ఎదుర్కోక తప్పదని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ లో రిషీ సునాక్ ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.