Putin: ఈస్టర్ సందర్భంగా ఉక్రెయిన్‌తో తాత్కాలిక కాల్పుల విరమణకు రష్యా నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆర్థడాక్స్ ఈస్టర్ పండుగను దృష్టిలో పెట్టుకుని ఉక్రెయిన్‌తో తాత్కాలికంగా కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం ప్రకటించారు. దీనికి సంబంధించి క్రెమ్లిన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి ఏప్రిల్ 12వతేదీ శనివారం అర్ధరాత్రి వరకు ఈ విరమణ అమల్లో ఉంటుందని క్రెమ్లిన్ తెలిపింది. ఈసమయంలో అన్ని దిశల్లో యుద్ధ చర్యలను నిలిపివేయాలని రష్యా సైనిక దళాల ప్రధాన కార్యాలయానికి అధ్యక్షుడు పుతిన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే,ప్రత్యర్థి వైపు నుంచి ఎలాంటి ప్రేరేపణలు వచ్చినా వాటిని తగిన విధంగా ఎదుర్కొనేందుకు తమ దళాలు సిద్ధంగా ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు.
వివరాలు
ఉక్రెయిన్ కూడా గౌరవించి కాల్పుల విరమణ పాటిస్తుంది: క్రెమ్లిన్
ఈ నిర్ణయాన్ని ఉక్రెయిన్ కూడా గౌరవించి కాల్పుల విరమణ పాటిస్తుందని ఆశిస్తున్నట్లు క్రెమ్లిన్ వెల్లడించింది. కొన్ని రోజుల క్రితం ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ కూడా ఈస్టర్ సందర్భంగా యుద్ధానికి విరామం ఇవ్వాలని అమెరికా ద్వారా ప్రతిపాదించిన విషయం గుర్తుచేశారు. గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ఆధ్వర్యంలో జరిగిన పలు దఫాల చర్చలు ఫలించలేదు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ అంశంపై అమెరికా దృష్టి మళ్లడంతో ఈ చర్చలు మరింత మందగించాయి. భూభాగ, రాజకీయ అంశాలపై రష్యా ఉంచిన డిమాండ్లను అంగీకరించడం లొంగిపోవడమేనని ఉక్రెయిన్ స్పష్టం చేస్తోంది. ఈ యుద్ధం కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా, కోట్ల మంది నివాసాలు కోల్పోయి నిరాశ్రయులయ్యారు.