Loading...
Russia Sanctions: రష్యాపై ఆంక్షలు.. కెనడాలో పెరిగిన కార్ల దొంగతనాలు.. అసలు కారణమిదే!
రష్యాపై ఆంక్షలు.. కెనడాలో పెరిగిన కార్ల దొంగతనాలు.. అసలు కారణమిదే!

Russia Sanctions: రష్యాపై ఆంక్షలు.. కెనడాలో పెరిగిన కార్ల దొంగతనాలు.. అసలు కారణమిదే!

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2026
12:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలు కెనడాలో కార్ల దొంగతనాలకు ఎలా దారితీశాయి? ఈ రెండు అంశాల మధ్య సంబంధం ఏమిటి? రష్యాకు కార్ల ఎగుమతులపై నిషేధం విధించిన తర్వాత.. కెనడాలో కొన్నేళ్లుగా జరుగుతున్న వాహనాల చోరీలకు ప్రత్యక్ష సంబంధం ఉందని ఓ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రభుత్వం పలు దేశాల కఠిన ఆంక్షలను ఎదుర్కొంది. యూరోపియన్‌ యూనియన్‌, అమెరికా, బ్రిటన్‌,కెనడా, జపాన్‌ నుంచి రష్యాకు కార్లు, లగ్జరీ వాహనాలు, వాటి విడిభాగాల ప్రత్యక్ష ఎగుమతులకు తీవ్రంగా అడ్డంకులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా 50వేల డాలర్లకు పైగా విలువైన వాహనాల ఎగుమతులపై నిషేధం అమల్లోకి వచ్చింది.

వివరాలు 

చైనా కార్లు వచ్చినా.. తగ్గని డిమాండ్

దీంతో మెర్సిడెస్‌ బెంజ్‌, ల్యాండ్‌ రోవర్‌, బీఎండబ్ల్యూ, ఆడి, పోర్షె వంటి ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీలు రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది.

ఫలితంగా అక్కడి సంపన్న వర్గాలకు తాము కోరుకున్న ఖరీదైన కార్లు అందుబాటులో లేకుండా పోయాయి.

పాశ్చాత్య ఆటోమొబైల్‌ కంపెనీలు రష్యా మార్కెట్‌ నుంచి వెళ్లిపోవడంతో ఏర్పడిన ఖాళీని చైనా సంస్థలు భర్తీ చేశాయి.

ప్రస్తుతం రష్యా ప్యాసింజర్‌ కార్ల మార్కెట్‌లో చైనా కంపెనీల వాటా 60 శాతానికి చేరింది.

అయితే విలాసవంతమైన కార్లకు అలవాటుపడిన రష్యా సంపన్నులు చైనా వాహనాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

తమ స్థాయికి తగ్గట్టుగా ల్యాండ్‌ రోవర్‌, డాడ్జ్‌ రామ్‌, ఫోర్డ్‌ ఎఫ్‌-150 వంటి మోడళ్లనే వారు కోరుకుంటున్నారు.

వివరాలు 

ఆర్డర్‌ వస్తే.. టార్గెట్‌ కారు చోరీ

కానీ ఆంక్షల కారణంగా వీటిని చట్టబద్ధంగా రష్యాకు తీసుకురావడం కష్టంగా మారింది.

ఈ పరిస్థితిని అవకాశంగా మార్చుకున్న వ్యవస్థీకృత నేర ముఠాలు ప్రత్యేకమైన సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి.

ఈ క్రమంలో వాటి దృష్టి కెనడాపై పడింది. అక్కడి తయారీ రంగంలో ఆటోమొబైల్‌ పరిశ్రమకు కీలక స్థానం ఉంది.

ఖరీదైన ఎస్‌యూవీలు, పికప్‌ ట్రక్కులు పెద్ద సంఖ్యలో తయారవుతుంటాయి.

అంతేకాదు.. ఉత్తర అమెరికాలో అతిపెద్ద కంటైనర్‌ టెర్మినల్‌ అయిన పోర్ట్‌ మాంట్రియల్‌ కూడా కెనడాలోనే ఉంది.

ముందుగా రష్యాలో ఏ బ్రాండ్‌ కారు కావాలి? ఏ మోడల్‌ కావాలి? ఎంత సంఖ్యలో అవసరం? అనే సమాచారాన్ని ఈ ముఠాలు సేకరిస్తాయి.

ఆ తర్వాత వచ్చిన ఆర్డర్లకు అనుగుణంగా కెనడాలోని యువకులను రంగంలోకి దింపుతాయి.

ADVERTISEMENT

వివరాలు 

ఆర్డర్‌ వస్తే.. టార్గెట్‌ కారు చోరీ

వారు అవకాశం కనిపించిన వాహనాన్ని యథేచ్ఛగా దొంగిలించరు. వచ్చిన ఆర్డర్‌ ప్రకారం.. ముందే గుర్తించిన కారును మాత్రమే లక్ష్యంగా చేసుకుని చోరీ చేస్తారు.

ఒక్కో కారును దొంగిలించిన వ్యక్తికి 500 నుంచి 1,500 డాలర్ల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం.

అనంతరం చోరీ చేసిన వాహనాలను మాంట్రియల్‌ టెర్మినల్‌కు తరలిస్తారు.

అక్కడ మోసపూరిత పత్రాలను ఉపయోగించి.. ఇతర సాధారణ సరకు మధ్యలో వాటిని దాచిపెట్టి రవాణా చేస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

పలు దేశాల మీదుగా రష్యాకు..

కెనడా నుంచి బయలుదేరిన ఈ వాహనాలు నేరుగా రష్యాకు చేరడం లేదు. యూఏఈ, జార్జియా, కజఖ్‌స్థాన్‌, కిర్గిస్థాన్‌, లిథువేనియా వంటి దేశాల మీదుగా వాటిని రష్యాకు తరలిస్తున్నట్లు సమాచారం.

ఈ వ్యవస్థీకృత ముఠాలు తరలించేందుకు ప్రయత్నించిన 1,900 వాహనాలను కెనడా పోలీసులు అడ్డుకున్నారు.

ఈ విషయాన్ని రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీస్‌ (RCMP) ఈ ఏడాది ఆగస్టు 5న ప్రకటించింది.

అయితే పోలీసులు ఇన్ని వాహనాలను అడ్డుకున్నప్పటికీ.. కెనడా రోడ్లపై నుంచి ఖరీదైన కార్లు మాయమవుతున్న ఘటనలకు మాత్రం ఇంకా పూర్తిగా అడ్డుకట్ట పడలేదు.

ADVERTISEMENT