
Russia: ఉక్రెయిన్‌లో రష్యా క్షిపణి దాడి.. 20 మందికిపైగా మృతి!
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి తీవ్రమైన దాడులకు పాల్పడింది. సుమీ నగరంలో జరిగిన క్షిపణి దాడుల్లో 20 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
ఈ విషయాన్ని స్థానిక తాత్కాలిక మేయర్ ఆర్టెమ్ కొబ్జార్ వెల్లడించారు. ఆదివారం పండుగ సందర్భంగా స్థానికులు పెద్ద ఎత్తున ఒకచోట చేరిన సమయంలో రెండు వరుస క్షిపణి దాడులు జరిగాయని తెలిపారు.
ఉత్సవ సమయంలో ఇలా ఘోరమైన ఘటన జరగడం బాధాకరమని సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఇటీవలే అమెరికా మధ్యవర్తిత్వంతో విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడులను నిలిపే తాత్కాలిక ఒప్పందం కుదిరిన నేపథ్యంలో, ఈ దాడులు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని మాస్కో, కీవ్ మధ్య పరస్పర ఆరోపణలు వచ్చాయి.
Details
దాడులపై తీవ్రంగా స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
ఈ దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొడిమిర్ జెలెన్‌స్కీ తీవ్రంగా స్పందించారు.
సామాన్య పౌరులను ఉద్దేశించి ఈ దాడులు జరిగాయని మండిపడ్డారు. నివాస గృహాలు, విద్యాసంస్థలు, వాహనాలు తుడిచిపెట్టుకుపోయాయని పేర్కొన్నారు.
పదుల సంఖ్యలో పౌరులు మృత్యువాతపడ్డారని తెలిపారు. అంతర్జాతీయ సమాజం ఈ దాడులపై మౌనంగా ఉండకూడదని, స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు.
జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. 'మాస్కో ఇలాంటి ఉగ్ర చర్యలే కోరుకుంటోంది. యుద్ధాన్ని కృత్రిమంగా లాగిస్తోంది. ఇలాంటి చర్యలతో శాంతి సాధ్యం కాదు.
రష్యాపై ఒత్తిడి లేకుండా చర్చలు ఫలించవు. ఓ ఉగ్రవాదిని ఎలా ఎదుర్కొంటామో, రష్యాను కూడా అలా ఎదుర్కొనాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.