Flight : వీసా,పాస్‌పోర్ట్, టిక్కెట్ లేకుండానే విమానయానం.. అమెరికాలో అడుగుపెట్టిన రష్యన్
విదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా పాస్‌పోర్ట్, వీసాతో పాటు సరైన టిక్కెట్ సైతం ఉండాల్సిందే. అలాంటిది రష్యాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఇవేవీ లేకుండా ఏకంగా విమానంలో విదేశం చేరుకున్న ఘటన ఆలస్యంగా వెల్లడైంది. తీరా ఆ వ్యక్తిని తనిఖీ చేయగా, పాస్‌పోర్ట్, వీసా లాంటివి ఏమీ లేనప్పటికీ అతను ఏకంగా దేశమే దాటేశాడు. విమానం దిగాక ఎయిర్‌పోర్టు సిబ్బంది ఆయనను చూసి ఆశ్చర్యపోయారు. ప్రయాణికులు జాబితాను పరిశీలించినా అందులో అతని పేరు లేకపోవడంతో సిబ్బంది అవాక్ అయ్యారు. టిక్కెట్ లేకుండా విమానం ఎలా ఎక్కావని నిలదీస్తే తనకేం గుర్తులేదని సమాధానమిచ్చాడు.ఈ ఘటనపై అమెరికా నేర పరిశోధనా సంస్థ FBI విచారణ చేపట్టింది. రష్యాకు చెందిన సెర్గెయ్ వ్లాదిమిరోవిచ్ ఒచిగవా ఇజ్రాయెల్‌లో స్థిరపడ్డాడు.
విమానం ఎలా ఎక్కానో గుర్తు లేదన్న రష్యన్ : అధికారులు
ఒచిగవా నవంబర్ 4న డెన్మర్క్‌లోని కోపెన్ హాగెన్ ఎయిర్ పోర్టు నుంచి అమెరికాకు ప్రయాణించాడు. అయితే ప్రయాణానికి కావాల్సిన పత్రాలేవీ ఆయన వద్ద లేవు. వీసా, పాస్‌పోర్ట్, టిక్కెట్ వంటివి ఏవీ లేకుండానే ఆయన ప్రయాణించాడు. కనీసం బోర్డింగ్ పాస్ కూడా లేదు. అయినా తన గమ్యాన్ని అలవోకగా చేరుకుని సిబ్బందిని విస్మయానికి గురిచేశాడు. అమెరికాలోని లాస్ ఏంజిలిస్‌లో విమానం దిగిన ఒచిగవాను చూసి అక్కడి సిబ్బందికి ఏమీ అర్థం కాలేదు. రెండు మూడు రోజుల విమాన జాబితాలను కూడా పరిశీలించగా, అతని పేరు ఎక్కడ కనిపించలేదు. విచారణలో తనకు 3రోజులుగా నిద్రలేదని,విమానం ఎలా ఎక్కానో గుర్తులేదన్నాడు. ప్రయాణంలో ఒచిగవా పలుమార్లు సీట్లు మారి, భోజనం కోసం అడిగాడని విమాన సిబ్బంది అన్నారు.