LOADING...
Russia: ఉక్రెయిన్‌పై మరోసారి విరుచుకుపడ్డ రష్యా .. 10 మంది మృతి
ఉక్రెయిన్‌పై మరోసారి విరుచుకుపడ్డ రష్యా .. 10 మంది మృతి

Russia: ఉక్రెయిన్‌పై మరోసారి విరుచుకుపడ్డ రష్యా .. 10 మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 30, 2026
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఏమాత్రం తగ్గడం లేదు. సోమవారం రష్యా జరిపిన క్షిపణి,డ్రోన్ దాడుల్లో కనీసం పది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 34 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ఈ దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెనెస్కీ తీవ్రంగా ఖండించారు. యుద్ధ ప్రాంతానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉక్రెయిన్ కీలక పారిశ్రామిక నగరమైన ద్నీప్రోపై రష్యా బలగాలు తరచూ దాడులు చేస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో మరణించిన వారిలో 13ఏళ్ల బాలిక కూడా ఉన్నట్లు ప్రాంతీయ గవర్నర్ ఒలెక్సాండర్ హంజా టెలిగ్రామ్‌లో వెల్లడించారు. దాడుల కారణంగా కిటికీలు ధ్వంసమైన భవనం ఫొటోలతో పాటు, మెట్ల సమీపంలో ఉన్న మృతదేహం అస్పష్ట చిత్రాన్ని కూడా ఆయన పంచుకున్నారు.

వివరాలు 

శాంతి ఒప్పందానికి సంబంధించి రష్యా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు 

అదే సమయంలో జపోరిజ్జియాపై జరిగిన డ్రోన్ దాడిలో కనీసం ముగ్గురు మరణించగా, ఒక చిన్నారితో సహా మరో ఆరుగురు గాయపడినట్లు జెలెనెస్కీ తెలిపారు. ఇక సుమీ, ఒడెసా, చెర్నిహివ్, ఖేర్సన్, ఖార్కివ్ ప్రాంతాలపై కూడా రష్యా దాడులు కొనసాగించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వెల్లడించారు. మరోవైపు, శాంతి ఒప్పందానికి సంబంధించి రష్యా వైఖరిలో ఎలాంటి మార్పు లేదని క్రెమ్లిన్ స్పష్టం చేసింది. 2024లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన డిమాండ్లే ఇప్పటికీ అమల్లో ఉన్నాయని తెలిపింది. మాస్కో తమ అధీనంలో ఉన్నాయని ప్రకటిస్తున్న నాలుగు ప్రాంతాల నుంచి కీవ్ బలగాలు పూర్తిగా వెనక్కి వెళ్లాలని, అలాగే నాటోలో చేరాలన్న ఉక్రెయిన్ ప్రణాళికలను అధికారికంగా విరమించుకోవాలని రష్యా ఇప్పటికీ కోరుతోందని పేర్కొంది.

వివరాలు 

ఉక్రెయిన్ కొత్త శాంతి ప్రతిపాదనను తిరస్కరించిన రష్యా 

ఇటీవల ఉక్రెయిన్ చేసిన కొత్త శాంతి ప్రతిపాదనను కూడా రష్యా తిరస్కరించింది. పోరాటాన్ని తగ్గించాలన్న కీవ్ సూచనను అంగీకరించకుండా, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిజ్జియా ప్రాంతాలపై పూర్తి నియంత్రణ సాధించే వరకు తమ సైనిక చర్యలు కొనసాగుతాయని పుతిన్ వారాంతంలో ఓ టెలివిజన్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అలాగే, ఇరు దేశాలు సుదూర క్షిపణి దాడులను పరస్పరం నిలిపివేసి, యుద్ధాన్ని డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిజ్జియా ప్రాంతాలకే పరిమితం చేయాలని ఉక్రెయిన్ ప్రతిపాదించినట్లు కూడా పుతిన్ వెల్లడించారు.

Advertisement