Loading...
Saudi Arabia: సౌదీపై పెరిగిన దాడులు.. ప్రజలకు ముందస్తు హెచ్చరికలు నిలిపివేత
సౌదీపై పెరిగిన దాడులు.. ప్రజలకు ముందస్తు హెచ్చరికలు నిలిపివేత

Saudi Arabia: సౌదీపై పెరిగిన దాడులు.. ప్రజలకు ముందస్తు హెచ్చరికలు నిలిపివేత

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 13, 2026
12:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

సౌదీ అరేబియాలో క్షిపణి దాడులకు సంబంధించి ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయడాన్ని అధికారులు నిలిపివేశారు. రియాద్ విమానాశ్రయంపై జరిగిన ప్రాణాంతక దాడులకు కొన్ని రోజుల ముందే ఈ హెచ్చరికలను ఆపేసినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ దాడుల్లో కనీసం 18 మంది ప్రాణాలు కోల్పోగా.. 300 మందికి పైగా గాయపడ్డారు. దేశంపై హౌతీ దాడులు పెరుగుతున్న సమయంలోనే హెచ్చరికలను నిలిపివేయడం గమనార్హం. సౌదీ ప్రభుత్వం మే నెలలో జాతీయ ముందస్తు హెచ్చరిక వ్యవస్థను ప్రారంభించింది. దీని ద్వారా మొబైల్ ఫోన్లు,సోషల్ మీడియా ఖాతాలకు క్షిపణి,ఇతర ముప్పులకు సంబంధించిన హెచ్చరికలు పంపించేది. అయితే, గత వారం విమానాశ్రయంపై దాడులు జరగడానికి ముందు ఈ హెచ్చరికలు ఆగిపోయాయి.

వివరాలు 

హెచ్చరికలు నిలిపివేతపై పాశ్చాత్య దేశం ఆరా

సౌదీ పౌర రక్షణ విభాగం ఎక్స్‌ ఖాతాలోని పోస్టుల ప్రకారం.. చివరిసారిగా సెప్టెంబర్ 29న దక్షిణ ప్రాంతమైన నజ్రాన్‌లో ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.

ప్రతికూల వాతావరణం, భారీ వర్షాలు,వరదలపై మాత్రం అధికారులు హెచ్చరికలు కొనసాగిస్తున్నారు.

సోమవారం కూడా ఈ తరహా సూచనలు జారీ చేశారు. క్షిపణులను అడ్డుకున్న ప్రాంతాలు, అవి పడిన ప్రదేశాలకు సంబంధించిన ఫొటోలు, వదంతులు లేదా సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవద్దని ప్రజలను హెచ్చరించారు.

ఇందుకు సంబంధించి మార్చిలో ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చింది.

గత వారం విమానాశ్రయంపై దాడులు జరగడానికి ముందు,హెచ్చరికలు ఎందుకు నిలిపివేశారని సౌదీ అధికారులను ఓ మిత్రదేశానికి చెందిన పాశ్చాత్య ప్రభుత్వ అధికారులు ప్రశ్నించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు అధికారులు రాయిటర్స్‌కు తెలిపారు.

వివరాలు 

సిబ్బందికి పాశ్చాత్య దేశాల రాయబార కార్యాలయాల హెచ్చరికలు

రాత్రి వేళల్లో హెచ్చరికల వల్ల ప్రజల నిద్రకు అంతరాయం కలుగుతోందని, చాలామంది ఫిర్యాదులు చేయడంతో వాటిని నిలిపివేసినట్లు సౌదీ అధికారులు సమాధానమిచ్చారని వారు వెల్లడించారు.

సౌదీ ప్రభుత్వం ప్రజలకు బహిరంగ హెచ్చరికలు జారీ చేయకపోయినా.. ఆ సమయంలో రియాద్‌పై దాదాపు డజను సార్లు దాడులు జరిగినట్లు ఇద్దరు పాశ్చాత్య అధికారులు తెలిపారు.

సౌదీలోని పాశ్చాత్య దేశాల రాయబార కార్యాలయాలు మాత్రం తమ సిబ్బందికి క్షిపణులు, డ్రోన్ల దాడులపై అంతర్గత హెచ్చరికలు పంపించాయి.

అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల నుంచి సేకరించిన నిఘా సమాచారంతో పాటు సౌదీ అధికారుల నుంచి అందిన వివరాల ఆధారంగా ఈ హెచ్చరికలను రూపొందించినట్లు ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న ముగ్గురు వ్యక్తులు వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు 

విమానాశ్రయ దాడికి ముందు హెచ్చరికలు కరువు..

గత వారం విమానాశ్రయంపై జరిగిన తొలి రెండు దాడుల సమయంలోనూ రాయబార కార్యాలయాల సిబ్బందికి హెచ్చరికలు అందాయి.

అయితే, శనివారం జరిగిన విమానాశ్రయ దాడికి ముందు తమ సిబ్బందికి కూడా ఎలాంటి అంతర్గత హెచ్చరిక అందలేదని సంబంధిత వ్యక్తులు తెలిపారు.

దీనికి కారణమేంటో మాత్రం వెల్లడించలేదు. శనివారం జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలను సౌదీ ప్రభుత్వ టెలివిజన్ ఆదివారం ప్రసారం చేసింది.

క్షిపణి దాడికి కొద్దిసేపటి ముందు విమానాశ్రయ టెర్మినల్‌లో ఉన్న ప్రయాణికులు ఈ వీడియోలో కనిపించారు.

విమానం ఎక్కేందుకు పలువురు వరుసలో నిల్చోగా.. మరికొందరు కుర్చీల్లో కూర్చొని మొబైల్ ఫోన్లు చూస్తున్నారు.

ఆ తర్వాత క్షిపణి పేలడంతో ఒక్కసారిగా ప్రకాశవంతమైన నారింజ రంగు వెలుగు కనిపించింది.

ADVERTISEMENT

వివరాలు 

ఇరాన్ దాడుల వేళ గల్ఫ్ దేశాల భద్రతా హెచ్చరికలు

ఫిబ్రవరిలో అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గల్ఫ్ దేశాలన్నీ ఇరాన్ డ్రోన్లు, క్షిపణి దాడులను ఎదుర్కొంటున్నాయి.

అయితే, ప్రజలను అప్రమత్తం చేయడంలో ఒక్కో దేశం ఒక్కో విధానాన్ని అనుసరిస్తోంది.

ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ దాదాపు ప్రతి దాడికి ముందు మొబైల్ ఫోన్లకు హెచ్చరికలు పంపిస్తోంది.

జులైలో జరిగిన తాజా దాడుల సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, కిటికీలకు దూరంగా ఉండాలని సూచించింది.

బహ్రెయిన్, కువైట్ దేశాలు మాత్రం ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తూ పలుమార్లు సైరన్లు మోగించాయి.

ADVERTISEMENT