మార్చిలో భగభగమన్న భూమి; చరిత్రలో రెండోసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
ఈ ఏడాది మార్చిలో రికార్డుస్థాయిలో భూమిపై ఉష్ణగ్రతలో నమైదైనట్లు ఈయూ వాతావరణ పర్యవేక్షణ ఏజెన్సీ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ గురువారం తెలిపింది. అంటార్కిటిక్ సముద్రపు మంచు మార్చి నెలలో అత్యల్ప స్థాయికి తగ్గిపోవడంతో భూమి వేడితో మండిపోయినట్లు పేర్కొంది. రికార్డు స్థాయిలో అత్యధిక ఉగ్రతలు నమోదైన రెండో మార్చి నెలగా నిలిపోయినట్లు ఏజెన్సీ వెల్లడించింది. 2016లో మార్చిలో తొలిసారి భూమి ఇంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను చవిచూసినట్లు వివరించింది. అయితే 2017, 2019, 2020 మార్చిలో ఈ ఏడాది మార్చితో సమానంగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ తెలిపింది.
దక్షిణ, మధ్య ఐరోపాలో ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువ నమోదు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపగ్రహాలు, నౌకలు, విమానాలు, వాతావరణ కేంద్రాల నుంచి బిలియన్ల కొద్దీ నమూనాలను సేకరించి కంప్యూటర్ విశ్లేషణల ఆధారంగా ఈ డేటాను తయారు చేసినట్లు కోపర్నికస్ సర్వీస్ తెలిపింది. దక్షిణ, మధ్య ఐరోపాలో ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా నమోదైనట్లు, ఉత్తర ఐరోపాలో చాలా వరకు సగటు కంటే తక్కువ వేడి రికార్డు అయినట్లు చెప్పింది. ఉత్తర ఆఫ్రికా, నైరుతి రష్యా, ఆసియా, ఈశాన్య ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలలో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కోస్టల్ అంటార్కిటికాలో సగటు ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా నమోదైనట్లు కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ నివేదించింది. అయితే వీటికి విరుద్ధంగా పశ్చిమ, మధ్య ఉత్తర అమెరికాలో సగటు కంటే చాలా చల్లగా ఉందని ఏజెన్సీ తెలిపింది.