Loading...
Singapore Air Pollution: ఇండోనేషియా అడవుల మంటల పొగతో సింగపూర్ ఉక్కిరిబిక్కిరి.. మలేషియాలో పాఠశాలలకు సెలవు
మలేషియాలో 200 పాఠశాలలు మూసివేత

Singapore Air Pollution: ఇండోనేషియా అడవుల మంటల పొగతో సింగపూర్ ఉక్కిరిబిక్కిరి.. మలేషియాలో పాఠశాలలకు సెలవు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 09, 2026
03:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

సింగపూర్‌లో వాయు కాలుష్యం ప్రపంచంలోనే అత్యధిక స్థాయికి చేరింది. ఇండోనేషియాలో చెలరేగిన అడవుల మంటల నుంచి వెలువడుతున్న పొగతో ఆగ్నేయాసియా ప్రాంతం దట్టమైన పొగమంచుతో కమ్ముకుంది. ఈ ప్రభావంతో మలేషియాలో సుమారు 200 పాఠశాలలు, కిండర్‌గార్టెన్లు, చిన్నపిల్లల సంరక్షణ కేంద్రాలను బుధవారం మూసివేశారు. మరోవైపు, సింగపూర్‌లో జరగనున్న ఫార్ములా వన్ (ఎఫ్‌1) రేసుకు కొద్ది రోజుల ముందు ఈ పరిస్థితి నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. వాయు నాణ్యతను పర్యవేక్షించే ఐక్యూఎయిర్ (IQAir) సమాచారం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నానికి సింగపూర్‌లో గాలి నాణ్యత 'చాలా అనారోగ్యకరమైన' స్థాయికి చేరింది. అంతకుముందు ప్రపంచంలో అత్యధిక కాలుష్యం నమోదైన నగరంగా ఉన్న మలేషియా రాజధాని కౌలాలంపూర్ రెండో స్థానానికి పడిపోయింది.

వివరాలు 

ఆగ్నేయాసియాలోని దక్షిణ ప్రాంతాల్లో పొడి వాతావరణం

సింగపూర్‌కు వాయువ్యంగా సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న మలేషియాలోని జోహోర్ రాష్ట్రంలో ఈ ప్రభావం తీవ్రంగా కనిపించింది.

అక్కడి బటు పహాట్ జిల్లాలో సుమారు 200 పాఠశాలలు, కిండర్‌గార్టెన్లు, చిన్నపిల్లల సంరక్షణ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు ఆదేశించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

రానున్న కొద్ది రోజుల్లో ఆగ్నేయాసియాలోని దక్షిణ ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుందని సింగపూర్ జాతీయ పర్యావరణ సంస్థ అంచనా వేసింది.

దీంతో అడవుల్లో మంటలు చెలరేగే ప్రమాదం, పొరుగు దేశాలకు పొగ వ్యాపించే ముప్పు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

సింగపూర్‌లోని మొత్తం ఐదు ప్రాంతాల్లోనూ గాలి నాణ్యత అనారోగ్యకరమైన స్థాయిలో ఉన్నట్లు పేర్కొంది.

వివరాలు 

ఎఫ్‌1 రేసుపై పొగ ప్రభావం ఉంటుందా?

సింగపూర్‌లో జరిగే ఫార్ములా వన్ రేసును నిర్వహించే సింగపూర్ జీపీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి ఈ పరిస్థితిపై స్పందించారు.

పొగ కారణంగా దృశ్యమానత తగ్గినా, ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడినా లేదా రేసు నిర్వహణకు ఇబ్బందులు ఎదురైనా సంబంధిత ప్రభుత్వ సంస్థలతో కలిసి పరిస్థితిని సమీక్షిస్తామని మంగళవారం తెలిపారు.

ఆ తర్వాతే ఈవెంట్‌పై ఉమ్మడి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. అయితే, ప్రస్తుతం పరిస్థితులు ఆందోళనకర స్థాయిలో లేవని ఎఫ్‌1 ప్రతినిధి వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు 

ఇండోనేషియా అడవుల్లో మంటలు..  

ఇండోనేషియాలో గత కొన్ని వారాలుగా అడవుల్లో మంటలు తీవ్రంగా వ్యాపిస్తున్నాయి.

దీంతో ఆగ్నేయాసియాలోని పలు ప్రాంతాలు దట్టమైన పొగతో కమ్ముకున్నాయి.

వ్యవసాయం కోసం అడవులను నరికి,మిగిలిన చెట్లకు నిప్పు పెట్టే పద్ధతి కారణంగా ఈ మంటలు అదుపు తప్పుతున్నట్లు తెలుస్తోంది.

దీనికి తోడు ఎల్‌నినోప్రభావం తీవ్రం కావడంతో వాతావరణం మరింత పొడిగా మారి మంటలు వ్యాపించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇండోనేషియా అటవీ శాఖకు చెందిన సిపోంగి (SiPongi)అగ్నిప్రమాదాల పర్యవేక్షణ వేదిక సమాచారం ప్రకారం..గత నెలలో అగ్నిప్రమాదాలు నమోదైన ప్రాంతాల సంఖ్య 2015తర్వాత అత్యధిక స్థాయికి చేరింది.

ఆ ఏడాది ఆగ్నేయాసియాలో తీవ్ర పొగ కాలుష్యం ఏర్పడి,ప్రజల రోజువారీ జీవనానికి అంతరాయం కలగడంతో పాటు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కూడా చోటుచేసుకున్నాయి.

ADVERTISEMENT

వివారాలు 

పామాయిల్, చక్కెర పరిశ్రమలపై పర్యావరణ సంస్థ ఆరోపణలు

అడవుల్లో మంటల నుంచి వెలువడుతున్న పొగకు సంబంధించి పర్యావరణ సంస్థ గ్రీన్‌పీస్ కీలక వివరాలను వెల్లడించింది.

20కి పైగా పామాయిల్, పల్ప్‌ (కాగితం తయారీకి ఉపయోగించే చెక్క గుజ్జు), చక్కెర ఉత్పత్తి సంస్థలకు చెందిన భూముల్లో మంటలకు కారణమైన ప్రాంతాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపింది.

వీటిలో మలేషియా, సింగపూర్‌తో సంబంధాలున్న కొన్ని సంస్థలు కూడా ఉన్నాయని పేర్కొంది.

వివరాలు 

మలేషియాలో మారథాన్‌పైనా ప్రభావం

వాయు కాలుష్యం కారణంగా మలేషియాలో క్రీడా కార్యక్రమాలపైనా ప్రభావం పడుతోంది.

గత వారం కౌలాలంపూర్‌లో నిర్వహించాల్సిన స్టాండర్డ్ చార్టర్డ్ మారథాన్‌లో పిల్లల పరుగు పోటీని నిర్వాహకులు రద్దు చేశారు.

వాయు కాలుష్యం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే పూర్తి మారథాన్, హాఫ్ మారథాన్ సహా ఇతర విభాగాల పోటీలను కొనసాగించారు.

అయినప్పటికీ, పూర్తి మారథాన్‌లో ముందుగా గమ్యస్థానానికి చేరుకున్న అథ్లెట్లు గత కొన్నేళ్లతో పోలిస్తే నెమ్మదిగా పరుగును పూర్తి చేశారు.

2015లోనూ ఇదే తరహా పొగ కాలుష్యం కారణంగా ఈ మారథాన్‌ను రద్దు చేశారు.

ADVERTISEMENT