Loading...
Wisconsin plane crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు మృతి
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు మృతి

Wisconsin plane crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 15, 2026
09:50 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఒక చిన్నారి సహా విమానంలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సౌక్ కౌంటీలోని విస్కాన్సిన్ డెల్స్‌కు సుమారు 10 మైళ్ల దూరంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో విమానం కూలిపోయింది. స్థానిక అధికారుల వివరాల ప్రకారం.. ఆరు సీట్ల సామర్థ్యం ఉన్న పైపర్ పీఏ-46 సింగిల్ ఇంజిన్ విమానం కెనోషా నుంచి మెనోమొనీకి వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. డెల్లోనా పట్టణ సమీపంలో అదుపుతప్పి అటవీ ప్రాంతంలో కూలిపోయింది. సమాచారం అందుకున్న సౌక్ కౌంటీ షెరీఫ్ కార్యాలయ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. విమానంలో ఉన్న ఆరుగురు ప్రయాణికులు మరణించినట్లు ధ్రువీకరించారు.

వివరాలు 

అడవిలో కూలిన విమానం

విమానం అడవిలో కూలిపోవడంతో భూమిపై ఉన్న ఇతరులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.

ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తున్నట్లు సమాచారం.

ప్రతికూల వాతావరణ పరిస్థితులే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

అయితే, ప్రమాదానికి అసలు కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు.

ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్‌టీఎస్‌బీ) అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు.

విచారణ పూర్తయిన తర్వాతే ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ADVERTISEMENT