Spain High-Speed Train Accident: స్పెయిన్‌లో హైస్పీడ్ రైళ్లు డీ... 46 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
స్పెయిన్‌లో రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొన్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 46 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 179 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాయి. పట్టాలు తప్పిన బోగీల్లో ప్రయాణికులు చిక్కుకుపోయి ఉండే అవకాశం ఉండటంతో సహాయక చర్యలను వేగవంతం చేశారు. ఈ ఘటనతో స్పెయిన్‌లో రైల్వే భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.
Details
ఒకే దిశలో వెళ్తుండగా ప్రమాదం
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. మాడ్రిడ్ నుంచి సెవిల్లే వైపు ఒకే దిశలో ప్రయాణిస్తున్న రెండు రైళ్లు ఈ ప్రమాదానికి గురయ్యాయి. ముందుగా వెళ్తున్న రైలు ఆగి ఉండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో రైలు దానిని ఢీకొన్నట్లు సమాచారం.
ఈ ఘటనలో రెండు బోగీలు పూర్తిగా పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. అయితే రైలు ఎందుకు ఆగింది? వెనుక నుంచి వచ్చిన రైలు దానిని ఎందుకు గుర్తించలేకపోయింది? వంటి అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రమాదానికి అసలు కారణం అధికారిక దర్యాప్తులో తేలనుంది.
Details
వందలాది మంది ప్రయాణికులు.. నిలిచిన రైళ్ల రాకపోకలు
ప్రమాదం జరిగిన సమయంలో ఒక రైలులో 397 మంది, మరో రైలులో 147 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అంటే మొత్తం 544 మంది ఈ రెండు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. వీరిలో పలువురు ప్రమాద తీవ్రతకు గురయ్యారు.
స్పెయిన్ రైల్వే వ్యవస్థను నిర్వహించే ఏడీఐఎఫ్ (ADIF) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఘటన కారణంగా మాడ్రిడ్, సియుడాడ్ రియల్, అందలూసియా ప్రాంతాల మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
రైల్వే అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ సహాయక చర్యలు చేపట్టారు.
Details
ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు
ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. రైళ్ల వేగం, సిగ్నలింగ్ వ్యవస్థ పనితీరు, రైల్వే ట్రాక్ పరిస్థితులు సహా అన్ని అంశాలను పరిశీలించాల్సి ఉంది.
ప్రమాదం జరిగిన సమయం, రైళ్ల కదలికలకు సంబంధించిన వివరాలు దర్యాప్తులో కీలకంగా మారనున్నాయి. ఈ ఏడాది జనవరిలో దక్షిణ స్పెయిన్‌లో జరిగిన మరో రైలు ప్రమాదంలో 45 మంది మరణించినట్లు సమాచారం.
వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజా ఘటనపై పూర్తి వివరాలు వెలువడాల్సి ఉండగా, బాధిత కుటుంబాలకు సహాయం అందించడం, ప్రమాదానికి కారణాలను గుర్తించడం ప్రస్తుతం అధికారుల ముందున్న ప్రధాన బాధ్యతలు.