Cyclone Arnab: అర్ణబ్ తుపాను ప్రభావం.. విశాఖలో నేలకొరిగిన చెట్లు, ఉత్తరాంధ్రకు హెచ్చరికలు
ఈ వార్తాకథనం ఏంటి
అర్ణబ్ తుపాను ప్రభావం ఉత్తరాంధ్రపై కనిపిస్తోంది. ముఖ్యంగా విశాఖపట్టణంలో మంగళవారం ఉదయం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. గాలుల తీవ్రతకు నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడుతున్నాయి. మహారాణిపేట అంగడిదిబ్బ వద్ద ఓ చెట్టు పాన్‌షాపుపై కూలిపోవడంతో దుకాణం ధ్వంసమైంది. రామ్‌నగర్‌లోని సేవాసదన్ స్కూల్ సమీపంలో మరో చెట్టు రోడ్డుకు అడ్డంగా పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు విశాఖలోని ఆర్‌కే బీచ్, రుషికొండ బీచ్‌లను మూసివేశారు. పర్యాటకులు, స్థానికులు సముద్ర తీరానికి వెళ్లవద్దని హెచ్చరించారు. తుపాను ప్రభావం శ్రీకాకుళం,విజయనగరం జిల్లాల్లోనూ తీవ్రంగా కనిపిస్తోంది. శ్రీకాకుళం,గార, లావేరు, ఆమదాలవలస, పొందూరు సహా జిల్లాలోని 12 మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
వివరాలు
విద్యాసంస్థలకు సెలవు
శ్రీకాకుళం జిల్లాలో సుమారు 4.65లక్షల ఎకరాల్లో ఖరీఫ్ వరి పంట కోతకు సిద్ధంగా ఉంది.
ఈ సమయంలో బలమైన గాలులు వీస్తుండటంతో పంట నేలవాలే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి వరి కోతలు చేపట్టవద్దని వ్యవసాయ అధికారులు సూచించారు.
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కంట్రోల్ రూమ్‌ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
విజయనగరం జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
దీంతో లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సహాయక కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
జిల్లాలో బుధ,గురువారాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
వివరాలు
24గంటల పాటు మూడు జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు
తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం,పార్వతీపురం మన్యం,కోనసీమ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
తుపాను కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.
తీరప్రాంత,లోతట్టు గ్రామాల్లోని ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు,సహాయక కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు.
ఈ మూడు జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు 24గంటల పాటు పనిచేయాలని మంత్రి సూచించారు.
సహాయక కేంద్రాల్లో ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలన్నారు.
కోతకు సిద్ధంగా ఉన్న వరి,మొక్కజొన్న,పత్తి పంటలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని,తుపాను బలహీనపడిన తర్వాత గ్రామాల వారీగా పంటలు,ఆస్తులకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని పేర్కొన్నారు.
వివరాలు
బీచ్‌ల మూసివేత
భారత వాతావరణ శాఖ (ఐఎండీ)అంచనాల ప్రకారం అర్ణబ్ తుపాను అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది.
అక్టోబర్ 28వ తేదీ మధ్యాహ్నానికి బాపట్ల,విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు.
తీరాన్ని తాకే సమయంలో గంటకు 115 నుంచి 125కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని,గరిష్ఠంగా గంటకు 140కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు.
తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ముందస్తు చర్యల్లో భాగంగా బాపట్ల జిల్లాలోని చీరాల,ఓడరేవు,రామాపురం బీచ్‌లను అధికారులు మూసివేశారు.
మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.ఇప్పటికే పలువురు మత్స్యకారులు తమ పడవలను నిజాంపట్నం హార్బర్ జెట్టీ వంటి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వివరాలు
కాకినాడ జిల్లాలో 101 సహాయక కేంద్రాల ఏర్పాటు
కాకినాడ జిల్లాలో ప్రజల కోసం 101 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌లను అందుబాటులోకి తెచ్చారు.
సహాయం కోసం 0884-2356801, 98499 03879 నంబర్లను సంప్రదించవచ్చు.
విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలు ఎదురైతే 1912 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని ఏపీఈపీడీసీఎల్ సూచించింది.
మొత్తంగా అర్ణబ్ తుపాను ప్రభావాన్ని తగ్గించేందుకు, ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం, జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయి.