Iran: హర్మూజ్ దేవుడిచ్చిన వరం.. టోల్ వసూలు హక్కు మాదే: ఇరాన్
ఈ వార్తాకథనం ఏంటి
హర్మూజ్ జలసంధి తమ దేశానికి దేవుడు ప్రసాదించిన అమూల్యమైన వరమని ఇరాన్ ప్రకటించింది. ఆ జలసంధిపై నియంత్రణ కొనసాగిస్తూ, అక్కడ ప్రయాణించే నౌకల నుంచి టోల్ రుసుము వసూలు చేసే హక్కు తమకే ఉందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, శాంతి చర్చల్లో ప్రధాన ప్రతినిధిగా ఉన్న మహమ్మద్ బాఘెర్ గలీబాఫ్ పేర్కొన్నారు. దోహాలో ఇరాన్, అమెరికా మధ్య కీలక సంప్రదింపులు ప్రారంభం కానున్న నేపథ్యంలో గలీబాఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ యుద్ధ పరిస్థితుల్లో తమకు దేవుడు ఇచ్చిన అత్యంత విలువైన వరం హర్మూజ్ జలసంధేనని ఆయన అన్నారు. ఇది తమకు అత్యంత కీలకమైన వ్యూహాత్మక ఆధిక్యాన్ని అందిస్తోందని పేర్కొన్నారు.
వివరాలు
అవగాహన ఒప్పందం అమలును అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో (ఎంఓయూ) హర్మూజ్ జలసంధిలో అన్ని దేశాల నౌకలకు నిరంతరాయంగా, ఉచితంగా ప్రయాణానికి అవకాశం కల్పించాలనే షరతు ఎక్కడా లేదని గలీబాఫ్ స్పష్టం చేశారు. అణు కార్యక్రమానికి సంబంధించిన తమ హక్కుల విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని ఆయన మరోసారి వెల్లడించారు. అమెరికాతో కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందంలో పొందుపరిచిన కీలక హామీలన్నీ పూర్తిగా అమలైన తర్వాత మాత్రమే తదుపరి దశ చర్చలకు సిద్ధమవుతామని చెప్పారు. అదేవిధంగా, ఈ అవగాహన ఒప్పందం అమలును అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని గలీబాఫ్ ఆరోపించారు.