Europe: రూటు మార్చిన సైబర్ దాడులు.. సూపర్‌మార్కెట్లు, అత్యవసర యాప్‌లే లక్ష్యం
ఈ వార్తాకథనం ఏంటి
ఇప్పటివరకు వ్యక్తులపై ఆర్థిక మోసాలు, కంపెనీల నెట్‌వర్క్‌లను హ్యాక్ చేయడం, సైనిక వ్యవస్థలను లక్ష్యంగా చేసుకోవడం వంటి వాటికే సైబర్ దాడులు పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. యూరప్‌లోని సూపర్‌మార్కెట్లలో శీతలీకరణ వ్యవస్థలను హ్యాకర్లు దెబ్బతీస్తుండగా.. రష్యా, ఉక్రెయిన్‌లలో అత్యవసర హెచ్చరికల కోసం ఉపయోగించే మొబైల్ యాప్‌లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. సైబర్ దాడులు సైనిక, వ్యాపార వ్యవస్థలకే పరిమితం కాకుండా సామాన్యుల రోజువారీ జీవితాలపై కూడా ప్రభావం చూపుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
వివరాలు
సూపర్‌మార్కెట్లలో శీతలీకరణ వ్యవస్థలపై దాడులు
స్వీడన్, బెల్జియం, లక్సంబర్గ్, ఐర్లాండ్, ఈస్టోనియా దేశాల్లోని పలు సూపర్‌మార్కెట్లలో నవంబర్ 1న అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఐసీఏ, కోఆప్, డెల్హాజే, క్యారీఫోర్, స్పార్, సూపర్ వాలు వంటి సంస్థలకు చెందిన స్టోర్లలో శీతలీకరణ యంత్రాలు, రిఫ్రిజరేటర్ల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 50 డిగ్రీల సెల్సియస్ దాటిపోయాయి.
కొన్ని స్టోర్లలో యంత్రాలు పూర్తిగా పనిచేయడం ఆగిపోయాయి. ఈ మార్పులు ఎక్కడి నుంచో చేసినట్లు అనుమానిస్తున్నారు.
ఉష్ణోగ్రతలు పెరగడంతో పెద్ద మొత్తంలో ఆహార పదార్థాలు పాడైనట్లు సమాచారం.
సైబర్ దాడుల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని భావిస్తున్న భద్రతా నిపుణులు విచారణ ప్రారంభించారు.
వివరాలు
ఫ్రాన్స్‌లోనూ వందలాది స్టోర్లకు నష్టం
దాదాపు 20 రోజుల క్రితం ఫ్రాన్స్‌లో కూడా ఇదే తరహా సైబర్ దాడులు జరిగాయి. అక్టోబర్ 11, 12 తేదీల్లో దాదాపు 700 స్టోర్లలోని శీతలీకరణ వ్యవస్థలను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారు.
ఫ్రీజర్లు ఎక్కువ సమయం డీఫ్రాస్ట్ మోడ్‌లో ఉండేలా చేయడంతో వాటి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి.
ఇంటర్‌మార్చ్, నెట్టో, క్యారీఫోర్, మోనోప్రిక్స్, కోఆపరేటివ్ యూ, ఈ-లెక్‌లెర్క్ వంటి సంస్థల స్టోర్లు ఎక్కువగా ప్రభావితమైనట్లు తెలుస్తోంది.
కొన్ని చోట్ల రిఫ్రిజరేటర్లు విపరీతంగా వేడెక్కి మంటలు కూడా చెలరేగినట్లు సమాచారం.
ఇటీవల ఇంటర్నెట్‌కు అనుసంధానమైన రిఫ్రిజరేటర్ల వినియోగం పెరగడం, భవనాల్లో విద్యుత్, శీతలీకరణ వ్యవస్థలను నియంత్రించేందుకు ఇంటర్నెట్, కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతలను ఉపయోగించడం ఈ దాడులకు కారణమై ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వివరాలు
రష్యా, ఉక్రెయిన్‌లలో తప్పుడు హెచ్చరికలు
యూరప్‌లో సూపర్‌మార్కెట్ల శీతలీకరణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్న హ్యాకర్లు.. రష్యా, ఉక్రెయిన్‌లలో మాత్రం అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు హెచ్చరికలు జారీ చేసే మొబైల్ యాప్‌లపై దాడి చేశారు.
ఉక్రెయిన్‌లోని అత్యవసర హెచ్చరికల యాప్‌ల ద్వారా తప్పుడు అలర్ట్‌లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
రాజధాని కీవ్‌లో రేడియోధార్మికత ప్రమాదకర స్థాయికి చేరిందని, ప్రజా సంక్షోభం ఏర్పడిందని, విష రసాయనాల ప్రభావం ఉందని పేర్కొంటూ పలు సందేశాలు వెలువడ్డాయి.
ఈ సందేశాలను అనధికార వ్యక్తులు పంపించినట్లు అధికారులు గుర్తించారు. అనుమానాస్పద లింకులను తెరవవద్దని ప్రజలను హెచ్చరించారు.
వివరాలు
మిలటరీ వ్యవస్థలకు నష్టం జరగలేదు
సైబర్ దాడుల అనంతరం కొంతసేపటికి సాంకేతిక లోపాలను సరిచేసినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.
ఈ దాడుల వల్ల సైనిక వ్యవహారాలకు ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు.
హెచ్చరికల వ్యవస్థలో సమస్య కొనసాగితే సోషల్‌మీడియాలో అధికారిక సమాచారాన్ని గమనించాలని, భౌతికంగా ఏర్పాటు చేసిన అలారమ్‌లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
తప్పుడు సందేశాల్లో అక్షర దోషాలు ఉండటంతో పాటు రష్యన్, ఉక్రెయిన్ భాషలు కలగలిసిపోయినట్లు అధికారులు గుర్తించారు.
వివరాలు
మిలటరీ వ్యవస్థలకు నష్టం జరగలేదు
ఇదిలా ఉండగా, రష్యా కూడా తమ దేశంలో ఇలాంటి సైబర్ దాడులు జరిగినట్లు వెల్లడించింది.
అక్కడా తప్పుడు నోటిఫికేషన్లు పంపినట్లు తెలిపింది. అయితే ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసే ప్రధాన వ్యవస్థలు మాత్రం పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని స్పష్టం చేసింది.
ఎస్‌ఎంఎస్‌లు, ప్రసార వ్యవస్థలు, సైరన్‌ల ద్వారా హెచ్చరికలు జారీ చేసే సదుపాయాలకు ఎలాంటి అంతరాయం కలగలేదని పేర్కొంది.