UKMTO: హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. టగ్బోట్పై దాడి, నౌకలకు హెచ్చరికలు
ఈ వార్తాకథనం ఏంటి
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లోని ఖోర్ ఫక్కాన్ పోర్టు సమీప సముద్ర జలాల్లో ప్రయాణిస్తున్న ఓ టగ్బోట్పై దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) వెల్లడించింది. గుర్తుతెలియని రెండు పరికరాలు బోటును ఢీకొట్టడంతో అది దెబ్బతిన్నట్లు తెలిపింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొంది. సముద్ర మార్గాల్లో ప్రయాణించే నౌకలు అప్రమత్తంగా ఉండాలని UKMTO సూచించింది. సముద్ర జలాల్లో ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని నౌకల సిబ్బందిని కోరింది. మరోవైపు శనివారం సౌదీ అరేబియాలోని అల్ జుబైల్ సమీపంలో మరో నౌకను గుర్తుతెలియని పరికరం ఢీకొట్టినట్లు UKMTO వెల్లడించింది. అయితే ఈ ఘటనలో నౌకలోని సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేసింది.
వివరాలు
ఇరాన్ ప్రపంచ ఇంధన సరఫరాను అడ్డుకుంటోంది: జేడీ వాన్స్
అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ శనివారం సాయంత్రం సీబీఎస్ టౌన్ హాల్ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
హర్ముజ్ జలసంధి నుంచి చమురు, సహజ వాయువును తరలించేందుకు అమెరికా నౌకాదళం సహకరించకపోయి ఉంటే, ప్రస్తుతం ఉన్న పెట్రోల్ ధరలు మూడు రెట్లు ఎక్కువగా ఉండేవని ఆయన అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాను పూర్తిగా అడ్డుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని వాన్స్ ఆరోపించారు.
అంతర్జాతీయ ఇంధన రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి విషయంలో నెలకొన్న పరిస్థితులపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
హర్ముజ్ జలసంధి గుండా 97 శాతం నౌకలు సురక్షితంగా ప్రయాణించాయి
ఇదిలా ఉండగా, హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు ప్రయత్నించిన నౌకల్లో 97 శాతం ఇరాన్ క్షిపణి దాడులకు గురికాకుండా సురక్షితంగా ప్రయాణించాయని అమెరికా సైన్యం వెల్లడించింది.
వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్నప్పటికీ, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ సముద్ర రవాణా మార్గం తెరిచే ఉందని పేర్కొంది.
అంతర్జాతీయ ఇంధన సరఫరాకు ప్రధాన మార్గమైన హర్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో యూఏఈ, సౌదీ అరేబియా సమీప సముద్ర జలాల్లో నౌకలపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి.