Page Loader
America: అమెరికాలో దారుణ ఘటన.. జనంపైకి దూసుకెళ్లిన దుండగుడు.. 15కు చేరిన మరణాలు 
అమెరికాలో దారుణ ఘటన.. జనంపైకి దూసుకెళ్లిన దుండగుడు.. 15కు చేరిన మరణాలు

America: అమెరికాలో దారుణ ఘటన.. జనంపైకి దూసుకెళ్లిన దుండగుడు.. 15కు చేరిన మరణాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2025
08:41 am

ఈ వార్తాకథనం ఏంటి

కొత్త సంవత్సర వేడుకల వేళ అమెరికాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నూతన సంవత్సర సంబరాల్లో పాల్గొన్న జనసందోహం మధ్య ఓ వ్యక్తి ట్రక్కుతో దూసుకెళ్లి, ఆ తర్వాత విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 15 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనకు కారణమైన నిందితుడిని పోలీసులు ఎదురు కాల్పుల్లో హతమార్చారు. ఈ ఘటనపై అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ఉగ్రవాద కోణంలో విచారణ చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి ఎఫ్‌బీఐ కీలక ప్రకటన చేసింది. న్యూఆర్లీన్స్‌లో ఈ బీభత్సానికి పాల్పడిన వ్యక్తి షంషుద్దీన్ జబ్బార్ (42)గా గుర్తించింది. జబ్బార్ అమెరికా పౌరుడు కాగా, టెక్సాస్‌లో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేసేవాడు.

వివరాలు 

ఫుట్‌బాల్ మ్యాచ్ కారణంగా నగరానికి మరింత మంది 

అతడు మిలిటరీలో కూడా ఏడేళ్లు సేవలందించాడు. అయితే, ఆర్థిక కష్టాలతో పాటు, భార్యతో విడాకులు పొందిన జబ్బార్ తీవ్ర మానసిక ఒత్తిడిలోకి వెళ్లినట్లు భావిస్తున్నారు. అతడి వాహనంలో ఐసిస్ ఉగ్రవాద సంస్థ జెండా కనుగొనడంతో, ఈ ఘటన ఉగ్రవాద చర్యగా భావించి విచారణ కొనసాగిస్తున్నట్లు ఎఫ్‌బీఐ అధికారులు తెలిపారు. న్యూఆర్లీన్స్‌లోని బార్బన్ వీధి కొత్త సంవత్సర వేడుకలకు ప్రసిద్ధి చెందింది. ఈసారీ వేలాది మంది ఈ వేడుకలకు తరలివచ్చారు. అదే సమయంలో సమీపంలోని స్టేడియంలో ఫుట్‌బాల్ మ్యాచ్ కారణంగా మరింత మంది నగరానికి చేరుకున్నారు. బుధవారం తెల్లవారుజామున 3:15 సమయంలో, జనసమూహం రోడ్డుపై ఉత్సాహంగా వేడుకలలో పాల్గొంటుండగా, జబ్బార్ తన వాహనాన్ని వారికి పైకి దూసుకెళ్లాడు.

వివరాలు 

 బైడెన్‌ సంతాపం.. 

ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, 35 మంది గాయపడ్డారు. ప్రమాదం అనంతరం జబ్బార్ విచక్షణారహితంగా కాల్పులు జరపడం మొదలుపెట్టాడు. పోలీసులు వెంటనే స్పందించి ఎదురు కాల్పులు జరిపి, అతడిని హతమార్చారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ, ఇది ఉగ్రదాడిగా అనుమానిస్తున్నామని, ప్రతి అంశాన్ని పరిశీలించి దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి వచ్చిన అమాయకులు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోవడంతో తన హృదయం బరువెక్కిపోయిందని ఆయన సంతాపం వ్యక్తం చేశారు. అమెరికాలో హింసాత్మక చర్యలకు ఎలాంటి స్థలం లేదని, ఇలాంటి ఘటనలను పూర్తిగా నివారించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విచక్షణారహితంగా కాల్పులు జరిపిన  షంషుద్దీన్ జబ్బార్