Desert: సహారా ఎడారిలో విషాదం.. నీరు దొరక్క 49 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాఫ్రికాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సహారా ఎడారిలో తాగునీరు దొరకక దాహంతో కనీసం 49 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నైగర్ దేశంలో జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి అధికారులు వెల్లడించిన వివరాలు హృదయ విదారకంగా ఉన్నాయి. మాలీలో జరిగిన ఓ ప్రాంతీయ పండుగకు హాజరైన వీరంతా తిరిగి స్వస్థలాలకు వెళ్తుండగా, వారు ప్రయాణిస్తున్న ట్రక్కు అసమాకా ప్రాంతానికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో నిలిచిపోయింది. ట్రక్కు చెడిపోవడంతో ప్రయాణికులంతా నిర్మానుష్యమైన ఎడారి ప్రాంతంలో చిక్కుకుపోయారు. ఆ ప్రాంతంలో ఎలాంటి సహాయం అందుబాటులో లేకపోవడంతో వారు కొన్ని రోజుల పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాగేందుకు నీరు దొరకక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వివరాలు
ఆ ప్రాంతంలో విషాద ఛాయలు
దాహం, విపరీతమైన వేడి, ఉక్కపోత కారణంగా వారి పరిస్థితి రోజురోజుకూ విషమించింది. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలకు తెగించి దాదాపు 50 కిలోమీటర్లకు పైగా కాలినడకన ప్రయాణించి నీరు తాగిన అనంతరం అసమాకాకు చేరుకున్నారు. అక్కడి అధికారులను కలిసి జరిగిన విషయాన్ని వివరించారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడ వారికి హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. ట్రక్కు నిలిచిపోయిన ప్రాంతం చుట్టుపక్కల డజన్ల కొద్దీ మృతదేహాలు కనిపించినట్లు అధికారులు వెల్లడించారు. విపరీతమైన ఎండ, ఉక్కపోత, తాగునీటి కొరత కారణంగా కనీసం 49 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. అయితే బాధితులు ఎడారిలో ఎన్ని రోజుల పాటు చిక్కుకుపోయారనే విషయంపై ఇప్పటికీ స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు.