నైజీరియా: నదిలో పడవ బోల్తా పడి 103 మంది మృతి
ఉత్తర నైజీరియాలో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న పడవ బోల్తా పడడంతో చిన్నారులు సహా 103 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర రాజధాని ఇలోరిన్ నుంచి 160 కిలోమీటర్ల (100 మైళ్ళు) దూరంలో ఉన్న క్వారా రాష్ట్రంలోని పటేగి జిల్లాలో గల నైజర్ నదిలో సోమవారం పడవ బోల్తాపడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో పడవలో 300 మంది వరకు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నదిలో పడిన వారి కోసం పోలీసులతో పాటు స్థానికులు కూడా ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటి వరకు 100మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
నీటిలో మునిగిపోయిన వారిలో ఎక్కువ మంది బంధువులే ఉన్నారు. వారందరూ వివాహానికి హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో ఈ ఘటన జరిగింది. పడవలో కూడా ఎక్కువ సంఖ్యలో జనం ఉండటంతో పాటు, అది నీటి లోపల ఉన్న పెద్ద దుంగను ఢీకొట్టి రెండుగా చీలిపోయిందని అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యల్లో భాగంగా మరిన్ని మృతదేహాలను వెలికి తీసే అవకాశం ఉంది. రెస్క్యూ ఆపరేషన్ బుధవారం రాత్రి వరకు కొనసాగుతుందని పోలీసు అధికార ప్రతినిధి అజయ్ తెలిపారు. చాలా ఏళ్లలో తాము చూసిన ఘోరమైన పడవ ప్రమాదం ఇదేనని స్థానికులు తెలిపారు.