LOADING...
Trump: ఇరాన్ ఉద్రిక్తతల మధ్య ట్రంప్ చైనా పర్యటన.. జిన్‌పింగ్‌తో కీలక చర్చలకు అవకాశం
జిన్‌పింగ్‌తో కీలక చర్చలకు అవకాశం

Trump: ఇరాన్ ఉద్రిక్తతల మధ్య ట్రంప్ చైనా పర్యటన.. జిన్‌పింగ్‌తో కీలక చర్చలకు అవకాశం

వ్రాసిన వారు Sirish Praharaju
May 13, 2026
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ అంశం ఉద్రిక్తతలకు దారితీస్తూ, చమురు మార్కెట్లలో ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఇరాన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్ విషయంలో చైనాతో ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదని, ఆ దేశం ఇప్పటికీ అమెరికా నియంత్రణలోనే ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్' తో ట్రంప్ కీలక భేటీ కానున్నారు. ముఖ్యంగా తైవాన్, రష్యా, వాణిజ్య సంబంధాలు, ఇండో-పసిఫిక్ ప్రాంత భద్రత వంటి అంశాలపై ఇద్దరు నేతల మధ్య విస్తృత చర్చలు జరిగే అవకాశముందని సమాచారం.

వివరాలు 

ఇరాన్ ప్రధాన అంశం కాదు

ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. వైట్‌హౌస్‌ నుంచి చైనా పర్యటనకు బయలుదేరే ముందు మెరైన్ వన్ హెలికాప్టర్ ఎక్కే సమయంలో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. "మాకు చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అయితే ఇరాన్ వాటిలో ప్రధాన అంశం కాదు. ఎందుకంటే ఇరాన్ ఇప్పటికే మా అదుపులోనే ఉంది. ఆ విషయంలో మాకు ఎవరి సహాయం అవసరం లేదు. శాంతియుతంగా అయినా,మరో విధంగా అయినా మేమే పరిస్థితిని నియంత్రిస్తాం. ఇరాన్ యుద్ధ వ్యవస్థ దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. వారు సరైన నిర్ణయం తీసుకోకపోతే మిగిలిన పని కూడా మేం పూర్తి చేస్తాం" అని ట్రంప్ హెచ్చరించారు.

వివరాలు 

నాటోపై ట్రంప్ విమర్శలు

ఇరాన్‌పై అమలు చేస్తున్న దిగ్బంధనం పూర్తిగా ప్రభావవంతంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రపంచంలో ఎన్నడూ లేనంతగా చమురు ఉత్పత్తి పెరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు అమెరికా అధికారులు మాత్రం ఇరాన్ అంశాన్ని పెద్దగా ప్రాధాన్యంగా చూపకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ట్రంప్ నాటో కూటమిపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. "మాకు అవసరమైన సమయంలో నాటో మద్దతుగా నిలవలేదు. నిజానికి మాకు నాటో అవసరం లేకపోయినా, అవసరమైతే కూడా వాళ్లు ముందుకు రాలేదు" అని విమర్శించారు. అయితే నాటో ప్రధాన కార్యదర్శి Mark Rutte మాత్రం కూటమి భవిష్యత్తుపై విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement

వివరాలు 

ట్రంప్ వెంట మస్క్, టిమ్ కుక్

ఇరాన్ సంక్షోభం ప్రస్తుతం ప్రపంచ భద్రతా వ్యవస్థలో కీలక అంశంగా మారిందని తెలిపారు. సముద్ర భద్రత, ప్రాంతీయ స్థిరత్వం వంటి అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. చైనాతో కొత్త వాణిజ్య ఒప్పందాల దిశగా ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్‌తో పాటు పలువురు ప్రముఖ అమెరికా వ్యాపారవేత్తలు కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. Elon Musk,Tim Cook వంటి ప్రముఖులు ట్రంప్ బృందంలో ఉన్నారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో బోయింగ్ విమానాల కొనుగోలు,అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు, ఇంధన సరఫరాలపై కీలక ప్రకటనలు వచ్చే అవకాశముంది. దాదాపు 500 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు, జీఈ ఇంజిన్లతో కూడిన పలు వైడ్‌బాడీ విమానాల కొనుగోలుపై చైనా,బోయింగ్ సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

Advertisement

వివరాలు 

చైనా నుంచి బోయింగ్‌కు వచ్చే తొలి పెద్ద ఆర్డర్

ఈ ఒప్పందం ఖరారైతే 2017 తర్వాత చైనా నుంచి బోయింగ్‌కు వచ్చే తొలి పెద్ద ఆర్డర్ అవుతుంది. అలాగే విమానయాన చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందాల్లో ఒకటిగా నిలిచే అవకాశముంది. అదే సమయంలో చైనా నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాల సరఫరాకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాన్ని పొడిగించే అంశంపైనా ఇరుదేశాలు చర్చించే అవకాశముంది. అయితే ఈ పర్యటనలోనే ఆ ఒప్పందం ఖరారవుతుందా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.

వివరాలు 

తైవాన్ అంశంపై అమెరికా స్పష్టత

తైవాన్ అంశంపై అమెరికా వైఖరిలో ఎలాంటి మార్పు లేదని అమెరికా అధికారులు మరోసారి స్పష్టం చేశారు. ట్రంప్, జిన్‌పింగ్ మధ్య గత సమావేశాల్లో కూడా తైవాన్ అంశం చర్చకు వచ్చినప్పటికీ అమెరికా విధానంలో మార్పు చోటుచేసుకోలేదని తెలిపారు. భవిష్యత్తులో కూడా అదే విధానం కొనసాగుతుందని పేర్కొన్నారు. తైవాన్‌కు ఆయుధాల విక్రయాల విషయంలో అమెరికా తన మద్దతును కొనసాగిస్తోందని అధికారులు వెల్లడించారు.

వివరాలు 

తైవాన్ అంశంపై అమెరికా స్పష్టత

ట్రంప్ ప్రభుత్వ తొలి ఏడాదిలోనే గత ప్రభుత్వ నాలుగేళ్ల కాలంతో పోలిస్తే అధిక మొత్తంలో రక్షణ సామగ్రి విక్రయాలకు అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. ఇటీవల తైవాన్ ప్రభుత్వం అమెరికా సైనిక పరికరాల కొనుగోలుకు ప్రత్యేక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. సుమారు 780 బిలియన్ తైవాన్ డాలర్ల వ్యయ పరిమితితో ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే కొన్ని కీలక రక్షణ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడం నిరాశ కలిగించిందని అమెరికా అధికారులు అభిప్రాయపడ్డారు. మొదట ప్రతిపాదించిన పూర్తి రక్షణ ప్యాకేజీకి నిధులు కేటాయించాలని తాము కోరుతున్నట్లు తెలిపారు.

Advertisement