LOADING...
Trump: బీజింగ్ సమావేశంలో జిన్‌పింగ్‌పై ట్రంప్ ప్రశంసలు
బీజింగ్ సమావేశంలో జిన్‌పింగ్‌పై ట్రంప్ ప్రశంసలు

Trump: బీజింగ్ సమావేశంలో జిన్‌పింగ్‌పై ట్రంప్ ప్రశంసలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 14, 2026
09:29 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌పై ప్రశంసలు కురిపించారు. బీజింగ్‌లో ప్రారంభమైన కీలక ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో మాట్లాడిన ట్రంప్.. జిన్‌పింగ్‌ను గొప్ప నాయకుడిగా, తన సన్నిహిత మిత్రుడిగా అభివర్ణించారు. చైనాతో అమెరికాకు అద్భుతమైన భవిష్యత్ ఉండబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక చర్చలకు ముందు జరిగిన ప్రారంభ సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. జిన్‌పింగ్‌తో సమావేశం కావడం తనకు గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఆయనను తన మిత్రుడిగా పిలవడం సంతోషంగా ఉందన్నారు. ఇరు దేశాల మధ్య కొన్ని సమస్యలు తలెత్తిన సందర్భాల్లో తాము నేరుగా ఫోన్లో మాట్లాడుకుని వెంటనే పరిష్కార మార్గాలు కనుగొన్నామని చెప్పారు. ఈ విషయం చాలా మందికి తెలియదని ట్రంప్ వ్యాఖ్యానించారు.

వివరాలు 

వాణిజ్యం వంటి అంశాలపై పెద్ద పురోగతి ఉండకపోవచ్చని అంచనా

జిన్‌పింగ్ గొప్ప నాయకుడని, ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. తమ ఇద్దరి మధ్య భవిష్యత్తులో మరింత మంచి సంబంధాలు కొనసాగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ పర్యటనకు తనతో పాటు ప్రపంచంలోని ప్రముఖ వ్యాపారవేత్తలను తీసుకొచ్చానని ట్రంప్ వెల్లడించారు. వారంతా జిన్‌పింగ్‌కు గౌరవం తెలియజేయడానికే వచ్చారని చెప్పారు. కొందరు ఈ సమావేశాన్ని అత్యంత కీలక శిఖరాగ్ర భేటీగా అభివర్ణిస్తున్నారని,చర్చల కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. అయితే ఈ భేటీలో ఆర్భాట కార్యక్రమాలు, ప్రతీకాత్మక అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉండే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా వాణిజ్య అంశాలు, తైవాన్‌తో అమెరికా సంబంధాలు వంటి కీలక విషయాలపై పెద్దగా పురోగతి కనిపించే అవకాశం తక్కువేనని అంచనా వేస్తున్నారు.

Advertisement