Trump: ట్రంప్ సంస్థకు నాలుగింతల ఆదాయం.. ఏడాదిలో 2.2 బిలియన్ డాలర్ల ఆదాయం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వ్యాపార సంస్థల ఆదాయం గణనీయంగా పెరిగింది. 2025 సంవత్సరంలో ఆయన వ్యాపార సామ్రాజ్యం మొత్తం 2.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.20 వేల కోట్లు) ఆదాయం నమోదు చేసినట్లు ప్రభుత్వ నైతిక విభాగానికి సమర్పించిన ఆర్థిక వివరాల్లో వెల్లడైంది. డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ప్రముఖ సంస్థ ద ట్రంప్ ఆర్గనైజేషన్ వివిధ రంగాల్లో వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఈ సంస్థకు ట్రంప్ యజమానిగా ఉండగా, ఆయన కుమారులు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్ ట్రస్టీలు, కార్యనిర్వాహక ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. క్రిప్టో కరెన్సీ నుంచి విలాసవంతమైన గోల్ఫ్ క్లబ్బులు వరకు ఈ సంస్థ విస్తృతంగా వ్యాపారాలు కొనసాగిస్తోంది.
వివరాలు
క్రిప్టో వ్యాపారంతోనే బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం
అధ్యక్ష ఎన్నికలకు ముందు అయిన 2024లో ట్రంప్ సంస్థకు 622మిలియన్ డాలర్ల ఆదాయం మాత్రమే నమోదైంది. అయితే 2025లో అది దాదాపు నాలుగు రెట్లు పెరిగి 2.2బిలియన్ డాలర్లకు చేరడం విశేషం. గత ఏడాది ట్రంప్‌కు క్రిప్టో కరెన్సీ రంగం భారీగా ఆదాయం అందించింది. సెలబ్రేషన్స్ కాయిన్స్ సంస్థ నుంచి రాయల్టీ రూపంలో 635 మిలియన్ డాలర్లు లభించాయి. అలాగే ట్రంప్ కుమారులు, ఆయన ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ కలిసి స్థాపించిన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థ ద్వారా మరో 500 మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చినట్లు ఆర్థిక నివేదికలో పేర్కొన్నారు. క్రిప్టోతో పాటు రియల్ ఎస్టేట్ సహా ఇతర వ్యాపార కార్యకలాపాల ద్వారా కూడా ట్రంప్ మిలియన్ల డాలర్ల ఆదాయం పొందారు.
వివరాలు
అధ్యక్ష పదవికి సంబంధం లేదన్న శ్వేతసౌధం
ట్రంప్ వ్యాపారాల ద్వారా వచ్చిన ఈ ఆదాయానికి ఆయన అధ్యక్ష పదవికి ఎలాంటి సంబంధం లేదని శ్వేతసౌధం స్పష్టం చేసింది. అమెరికాలో 1978లో అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు తమ ఆస్తులు, ఆదాయ వివరాలను క్రమం తప్పకుండా ప్రభుత్వానికి వెల్లడించడం తప్పనిసరి.